ప్రమోషన్‌కు పనికిరాకపోతే పోతాను... అన్నంత పనిచేసిన ఐపీఎస్ వీకే సింగ్
తెలంగాణలో సీనియర్ ఐపీఎస్ అధికారి, డీజీ వీకే సింగ్ తన పదవికి రాజీనామా చేశారు. ప్రస్తుతం తెలంగాణ పోలీస్ అకాడమీ డైరెక్టర్‌గా పనిచేస్తున్న ఆయన తన రాజీనామా లేఖను కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు పంపారు
తెలంగాణలో సీనియర్ ఐపీఎస్ అధికారి, డీజీ వీకే సింగ్ తన పదవికి రాజీనామా చేశారు. ప్రస్తుతం తెలంగాణ పోలీస్ అకాడమీ డైరెక్టర్‌గా పనిచేస్తున్న ఆయన తన రాజీనామా లేఖను కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు పంపారు.
వీకే సింగ్ గత కొంతకాలంగా ప్రభుత్వంపై అసంతృప్తిగా ఉన్నారు. 1987 ఐపీఎస్ బ్యాచ్ కు చెందిన తనకు 33 సంవత్సరాల సర్వీసు పూర్తి చేసుకున్న తర్వాత కూడా పదోన్నతి కల్పించకపోవడంపై ఆయన గతంలో ప్రశ్నించారు. తాను డీజీగా ఎంపానెల్ అయ్యానని,1986 బ్యాచ్ ఐపిఎస్ అధికారులు మూడేళ్ల కిందట పదోన్నతి పొందారని ఆయన ఆ లేఖలో ప్రస్తావించారు.
సరైన ఖాళీలు లేకుండానే 1989 బ్యాచ్ ఐఏఎస్ లకు కూడా పదోన్నతులు వచ్చాయని, ఏపీ తో సహా ఇతర రాష్ట్రాల్లో 1989 బ్యాచ్ ఐఏఎస్ లు కూడా పదోన్నతులు పొందారని ఆయన తన లేఖలో పేర్కొన్నారు. ప్రభుత్వం తన పట్ల చూపుతున్న నిర్లక్ష్యం కారణంగా తాను పని చేయలేకపోతున్నానని ఆయన పేర్కొన్నారు.
తాను పదోన్నతి పనికిరాను అని ప్రభుత్వం భావిస్తే ఈ ఉద్యోగాన్ని వదిలేయడానికి సిద్ధంగా ఉన్నాను అంటూ సంచలన వ్యాఖ్యలు చేస్తూ వీకే సింగ్ లేఖ రాశారు. పోలీస్ అకాడమీ కోసం తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న ఖర్చు వృథా అని ఆరోపించారు.
అంతేకాక, గతంలో ఓ సందర్భంలో వీకే సింగ్ మాట్లాడుతూ పోలీస్ అకాడమీ వల్ల పెద్ద ఉపయోగం లేదని విమర్శించారు. ఈ వ్యాఖ్యలు పోలీసు శాఖలో పెను దుమారాన్ని రేపాయి.