Asianet News TeluguAsianet News Telugu

అందరికీ అవకాశం.. తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు కీలక నిర్ణయం...

టెన్త్ లో అందరినీ పాస్ చేసి ఇంటర్ లో సీటు లేదని చెప్పడం సబబు కాదన్న భావన విద్యాశాఖ వర్గాల్లో ఉంది. ప్రభుత్వ కాలేజీల్లో ఇప్పటికే 75వేలమంది వరకు చేరారని అధికారులు చెబుతున్నారు. గడువు పెంచితే ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. 

telangana intermediate board key decision for students - bsb
Author
Hyderabad, First Published Jul 9, 2021, 10:27 AM IST

హైదరాబాద్ : దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్క విద్యార్థికి ఇంటర్ లో సీటు కల్పించాలని ఇంటర్మీడియట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. అవసరమైతే అదనపు సెక్షన్లను సిద్ధం చేయాలని ఆదేశాలు జారీ చేసింది. పరిస్థితిని బట్టి బ్యాచ్ల వారీగా క్లాసులు నిర్వహిస్తారు. 

పదో తరగతిలో అందరినీ పాస్ చేయడం వల్ల ఇంటర్ లో ఎక్కువ మంది చేరే అవకాశముంది. ప్రతి ఒక్కరికీ కాదనకుండా సీటు కల్పిస్తే వారి భవిష్యత్తు బాగుంటుందని అధికారులు భావిస్తున్నారు. పైగా ప్రభుత్వ కాలేజీల్లో సీట్లు లేకపోతే వారంతా ప్రైవేటు కాలేజీల్లో ఎక్కువ ఫీజులు చెల్లించి చేరాల్సి వస్తుంది. 

టెన్త్ లో అందరినీ పాస్ చేసి ఇంటర్ లో సీటు లేదని చెప్పడం సబబు కాదన్న భావన విద్యాశాఖ వర్గాల్లో ఉంది. ప్రభుత్వ కాలేజీల్లో ఇప్పటికే 75వేలమంది వరకు చేరారని అధికారులు చెబుతున్నారు. గడువు పెంచితే ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. 

రాష్ట్రంలో 5.70 లక్షల మంది విద్యార్థులు పదో తరగతి పాసయ్యారు. మొత్తం 2,500వరకు ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ జూనియర్ కాలేజీలున్నాయి. వాటిల్లో 5 లక్షల వరకు సీట్లున్నాయి. 405 ప్రభుత్వ కాలేజీల్లో ఏటా 80 వేల మంది దాకా చేరుతుంటారు. 

సాధారణంగా ప్రతి కాలేజీలో సీఈసీ, హెచ్ఈసీ కలిసి 88 సీట్లు ఉంటాయి. బైపీసీ, ఎంపీసీకి కలిపి మరో 88 సీట్లు ఉంటాయి. డిమాండ్ ను బట్టి సీట్ల సంఖ్యను పెంచే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. ప్రస్తుతం ఆన్ లైన్ క్లాసులే జరుగుతున్నాయి. అందువల్ల ప్రైవేట్ కాలేజీల్లో చేరినా, ప్రభుత్వ కాలేజీల్లో చేరినా ఒకటేనని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. 

సెక్షన్లు పెంచితే ఆ మేరకు బోధనా సిబ్బందిని కూడా పెంచాల్సి ఉంటుంది. అదనంగా కాంట్రాక్ట్ పద్ధతిలో కొందరిని తీసుకునే అవకాశాలూ ఉన్నాయి. కాగా, 2021-22 విద్యా సంవత్సరానికి ఇంటర్ ఫస్టియర్ ప్రవేశాల గడువును ఈ నెల 31 వరకు ఇంటర్ బోర్డు అధికారులు పొడిగించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios