హైదరాబాద్ రామంతాపూర్ నారాయణ కాలేజీలో విద్యార్ధి ఆత్మహత్యాయత్నం వ్యవహారాన్ని తెలంగాణ ఇంటర్ బోర్డ్ సీరియస్‌గా పరిగణిస్తోంది. ఈ క్రమంలో విద్యార్ధులకు అండగా వుంటామని.. ఎలాంటి సమస్యలున్నా నేరుగా బోర్డును సంప్రదించాలని తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఒమర్ జలీల్ సూచించారు.
హైదరాబాద్ రామంతాపూర్ నారాయణ కాలేజీలో విద్యార్ధి ఆత్మహత్యాయత్నం వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. టీసీ ఇవ్వకుండా తనను వేధిస్తున్నారంటూ తీవ్ర మనస్తాపానికి గురైన విద్యార్ధి కళాశాల ప్రిన్సిపాల్ రూమ్‌లో పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేయడంతో ముగ్గురు తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. దీనిపై తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఒమర్ జలీల్ స్పందించారు. కాలేజీ యాజమాన్యాన్ని నివేదిక కోరామని.. దీని ఆధారంగా చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. విద్యార్ధులకు సర్టిఫికెట్స్ ఆపినా, ఫీజుల కోసం వేధించినా కఠిన చర్యలు తీసుకుంటామని జలీల్ హెచ్చరించారు. విద్యార్ధులకు అండగా వుంటామని.. ఎలాంటి సమస్యలున్నా నేరుగా బోర్డును సంప్రదించాలని ఆయన సూచించారు.
కాగా.. రామంతాపూర్‌లోని నారాయణ కాలేజీలో ఓ విద్యార్ధి ప్రిన్సిపాల్ గదిలోకి వెళ్లి ఆయనను టీసీ ఇవ్వమని కోరాడు. అయితే గతకొద్దిరోజులుగా బాధిత విద్యార్ధి టీసీ కోసం కాలేజీకి వెళ్తుంటే తిప్పుతున్నారు. దీంతో విసిగిపోయిన ఆ విద్యార్ధి ప్రిన్సిపాల్ గదిలో పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు.
Also REad:రామంతాపూర్ నారాయణ కాలేజ్ ఘటన.. ఇంటర్ బోర్డ్ సీరియస్, కాలేజీలకు కీలక ఆదేశాలు
అంతేకాదు.. శరీరం మంటల్లో కాలిపోతుండగానే ప్రిన్సిపాల్ సుధాకర్ రెడ్డిని పట్టుకున్నాడు. ఈ ఘటనలో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. ఈ క్రమంలో అరుపులు , కేకలు వినిపించడంతో ఏవో అశోక్ రెడ్డి ప్రిన్సిపాల్‌ని కాపాడేందుకు ప్రయత్నించారు. ఈ ఘటనలో ఆయన కూడా తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది ముగ్గురి మంటలను అదుపు చేసి ఆసుపత్రికి తరలించారు. తొలుత గాంధీ ఆసుపత్రికి అక్కడి నుంచి మెరుగైన చికిత్స నిమిత్తం యశోదా ఆసుపత్రికి తరలించారు.
