తెలంగాణ విద్యుత్ వినియోగం సరికొత్త రికార్డును సృష్టించింది. రాష్ట్ర చరిత్రలో మంగళవారం అత్యధికంగా 15,062 మెగావాట్ల గరిష్ట విద్యుత్ డిమాండ్ నమోదైంది.
తెలంగాణ విద్యుత్ వినియోగం సరికొత్త రికార్డును సృష్టించింది. రాష్ట్ర చరిత్రలో మంగళవారం అత్యధికంగా 15,062 మెగావాట్ల గరిష్ట విద్యుత్ డిమాండ్ నమోదైంది. దక్షిణ భారతదేశంలో తమిళనాడు తర్వాత తెలంగాణ రెండో అతిపెద్ద విద్యుత్ వినియోగదారుగా ఉన్న సంగతి తెలిసిందే. ఈరోజు(మార్చి14) ఉదయం 10:03 గంటలకు తెలంగాణలో 15,062 మెగా వాట్ల విద్యుత్ వినియోగం జరిగినట్లు ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ ప్రభాకర్ రావు వెల్లడించారు. ఇక, రాష్ట్రంలో సోమవారం (మార్చి 13) గరిష్టంగా 14,138 మెగావాట్ల విద్యుత్ వినియోగం నమోదైంది.
ఈ రోజు సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ గరిష్ట డిమాండ్ 9,121 మెగావాట్లు, నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ గరిష్ట డిమాండ్ 5,738 మెగావాట్లుగా ఉంది. గత ఏడాది ఇదే తేదీన దరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ గరిష్ట డిమాండ్ 7,849 మెగావాట్లు, నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ గరిష్ట డిమాండ్ 4,711 మెగావాట్లుగా ఉంది.
‘‘మార్చి నెలలో గరిష్ట డిమాండ్ 15,000 మెగావాట్లకు చేరుకుంటుందని మేము ఇప్పటికే ఊహించాము మరియు ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు విద్యుత్ సరఫరాకు ఏర్పాట్లు చేసాము’’ అని ప్రభాకర్ రావు తెలిపారు. ఇక, గతేడాది మార్చి నెలలో 14,160 మెగా వాట్ల అత్యధిక విద్యుత్ వినియోగం నమోదైంది. ఈ సారి ఆ రికార్డును అధిగమించి రికార్డు స్థాయిలో విద్యుత్ వినియోగం జరుగుతుంది.
ఇక, రాష్ట్రంలోని మొత్తం విద్యుత్ వినియోగంలో వ్యవసాయ రంగం వాటా 37 శాతంగా ఉంది. ఎక్కువ మంది రైతులు పంటల సాగు కోసం బోర్‌వెల్‌లను ఉపయోగించడమే ఇందుకు కారణం. అయితే వేసవిలో రైతులతో పాటు వినియోగదారులందరికీ నిరంతర విద్యుత్ సరఫరా కోసం అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్టుా తెలిపారు.
