హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్రంలో డెంగ్యూ బారినపడి మనుషులు చనిపోతున్నా ప్రభుత్వం స్పందించదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. డెంగ్యూపై ప్రజల్లో సరైన అవగాహన కల్పించలేదని అభిప్రాయపడింది. 

గురువారం పూర్తి వివరాలతో హైకోర్టుకు హాజరుకావాలని ఉన్నతాధికారులను ఆదేశించింది. ఈ సంరద్భంగా వైద్యఆరోగ్య శాఖకు చెందిన ప్రిన్సిపల్ సెక్రటరీ, హెల్త్ డైరెక్టర్స్, మున్సిపల్ కమిషనర్ లకు ఆదేశాలు జారీ చేసింది.  

ఇకపోతే తెలంగాణలో డెంగ్యూ వ్యాధి విజృంభిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, దోమల నివారణకు సరైన చర్యలు తీసుకోవడం లేదని వైద్యురాలు డా.కరుణ హైకోర్టును ఆశ్రయించారు. 

కరుణ పిటీషన్ పై హైకోర్టు విచారణ చేపట్టింది. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వానికి దోమల నివారణకు సంబంధించి మధ్యంతర ఉత్తర్వులను సైతం జారీ చేసింది. అయినప్పటికీ డెంగ్యూ బారినపడి ప్రజలు మరణించడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. 

ఈనేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దోమల నివారణకు తీసుకుంటున్న చర్యలపై అసహనం వ్యక్తం చేసింది. అయితే గురువారం హైకోర్టులో హాజరుకావాలని ప్రభుత్వానికి ఆదేశించడంపై చర్చ జరుగుతుంది. 

ఇకపోతే డెంగ్యూ బారినపడి తెలంగాణలో ఇప్పటి వరకు 5మంది చనిపోయారు. ఇటీవలె ఖమ్మం జిల్లాలో జూనియర్ సివిల్ జడ్జి జయమ్మ సైతం మరణించారు. డెంగ్యూతో బాధపడిన ఆమె హైదరాబాద్ లోని కిమ్స్ లో చికిత్స పొందుతూ మరణించిన సంగతి తెలిసిందే.