Asianet News TeluguAsianet News Telugu

ఏపీకి నెల రోజుల్లో విద్యుత్ బకాయిల చెల్లింపుపై తెలంగాణకు ఊరట: స్టే విధించిన హైకోర్టు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నెల రోజుల్లో విద్యుత్ బకాయిలను చెల్లించాలని కేంద్రం ఇచ్చిన ఆదేశాలపై తెలంగాణ హైకోర్టు స్టే ఇచ్చింది. కేంద్రం ఆదేశాలపై తెలంగాణసర్కార్ హైకోర్టును ఆశ్రయించింది. 

Telangana high Court Stays on union Government Orders over Electricity Dues
Author
First Published Sep 28, 2022, 3:26 PM IST

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో ఊరట లభించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభురత్వానికి రూ. 6,995 కోట్లను 30 రోజుల్లో చెల్లించాలని  కేంద్రం ఇచ్చిన ఉత్తర్వులపై తెలంగాణ హైకోర్టు బుధవారం నాడు స్టే ఇచ్చింది.  ఈ విషయమై తెలంగాణ ప్రభుత్వం హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ పై ఉన్నత న్యాయస్థానం ఇవాళ స్టే ఇచ్చింది. తెలంగాణ ప్రభుత్వం తరపున అడిషనల్ అడ్వకేట్ జనరల్ రాంచందర్ రావు వాదించారు. 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెల్లించాల్సిన విద్యుత్ బకాయిలను నెల రోజుల్లో చెల్లించాలని తెలంగాణ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది ఆగస్టు 29వ తేదీన  ఆదేశాలు  జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తెలంగాణ ప్రభుత్వం రూ. 3,441.78 కోట్ల విద్యుత్ బకాయిలను చెల్లించాల్సి ఉంది.  దీనికి సర్ చార్జీని కలుపుకుంటే రూ. 6,995 కోట్లకు చేరింది. ఈ బకాయిలను వెంటనే చెల్లించాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది.ఈ ఆదేశాలపై తెలంగాణ సర్కార్ సీరియస్ అయింది.  ఏపీ నుండి తమకు రూ. 17 వేల కోట్లు బకాయిలు రావాల్సి ఉందని తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రకటించారు. తమకు రావాల్సిన బకాయిల్లో ఈ నిధులను కట్ చేసుకొని తమకు మిగతా బకాయిలు ఇవ్వాలని కేసీఆర్ కోరారు. ఈ మాసంలో జరిగిన అసెంబ్లీ సమావేశంలోనే కేసీఆర్  ఈ విషయాన్ని తెలిపారు.

also read:ఏపీకి నెల రోజుల్లో విద్యుత్ బకాయిలు చెల్లించాలి: తెలంగాణకు కేంద్రం ఆదేశం

తాను చెబుతున్న విషయాలు అబద్దమైతే రాజీనామాకు కూడా వెనుకాడబోనని కూడా ఆయన ప్రకటించిన విషయం తెలిసిందే. 2014 జూన్ 2నుండి 2017 జూన్ 10వ తేదీ వరకు ఏపీ ప్రభుత్వం తెలంగాణకు విద్యుత్ ను సరఫరా చేసినందుకు డబ్బులు చెల్లించలేదని ఆ రాష్ట్రం కేంద్రానికి ఫిర్యాదు చేసింది.  ఈ ఫిర్యాదుపై కేంద్రం ఈ ఆదేశాలు జారీ చేసింది. తమ అభిప్రాయాలు  తెలుసుకోకుండానే  ఏపీ ప్రభుత్వానికి నెల రోజుల్లోనే బకాయిలు చెల్లించాలని కేంద్రం ఇచ్చిన ఆదేశాలు ఏకపక్షమని తెలంగాణ వాదించింది.ఈ విషయమై న్యాయ పోరాటం చేస్తామని తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి జగదస్ రెడ్డి ఈ ఏడాది ఆగస్టు 30వ తేదీన ప్రకటించారు.  

విద్యుత్ బకాయిల విషయమై తెలంగాణ ప్రభుత్వం కోర్టును ఆశ్రయించి స్టే తెచ్చుకుంది. ఈ నెల 4వ తేదీన జరిగిన దక్షిణాది రాష్ట్రాల జోనల్ కమిటీ సమావేశంలో కూడా తెలంగాణ ప్రభుత్వం ఈ విషయాన్ని ప్రస్తావించింది. కేంద్రుం ఏకపక్షంగా  ఈ ఆదేశాలు జారీ చేసిందని తెలంగాణ తమ అభ్యంతరాన్ని ఈ సమావేశంలో వ్యక్తం చేసింది.తమ రాష్ట్రానికి రావాల్సిన విద్యుత్ బకాయిలను ఎగ్గొట్టేందుకు తెలంగాణ ప్రయత్నిస్తుందని గతంలోనే ఏపీ విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శించిన విషయం తెలిసిందే

Follow Us:
Download App:
  • android
  • ios