హరితహరం కార్యక్రమంలో భాగంగా  మొక్కలను పెంచాలని చెబుతూనే మరో వైపు చెట్లను నరికివేయడాన్ని తెలంగాణ హైకోర్టు తప్పుబట్టింది. రవీంద్రభారతి వద్ద కళాభవన్ లో చెట్ల నరికివేతను నిలిపివేయాలని తెలంగాణ హైకోర్టు జీహెచ్ఎంసీని  ఆదేశించింది.

హైదరాబాద్: హైద్రాబాద్ రవీంద్రభారతి వద్ద కళాభవన్ లో చెట్ల నరికివేతను నిలిపివేయాలని తెలంగాణ హైకోర్టు జీహెచ్ఎంసీని ఆదేశించింది.హైద్రాబాద్ కి చెందిన శివకుమార్ అనే వ్యక్తి లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై హైకోర్టు సోమవారం నాడు విచారణ నిర్వహించింది. ఈ పిటిషన్ పై ఎలాంటి కారణం లేకుండా చెట్లు నరికేస్తున్నారని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

సుమారు 60 ఏళ్లుగా పక్షులకు అవాసంగా ఉన్న చెట్లను నరికేయవద్దని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టును కోరారు. హరితహరం అంటూనే మరో వైపు చెట్లను నరికివేస్తున్నారని హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. చెట్ల నరికివేతపై స్టే విధించింది హైకోర్టు ధర్మాసనం. ఈ విషయమై పూర్తి వివరాలు సమర్పించాలని తెలంగాణ హైకోర్టు జీహెచ్ఎంసీని ఆదేశించింది.తెలంగాణ ప్రభుత్వం అడవుల విస్తీర్ణాన్ని పెంచేందుకు గాను హరితహరం కార్యక్రమాన్ని చేపట్టింది.ఈ కార్యక్రమం కింద లక్షలాది మొక్కలను తెలంగాణ సర్కార్ పెంచుతుంది.