Asianet News TeluguAsianet News Telugu

పంట నష్టంపై రాష్ట్ర ప్రభుత్వం అద్భుతం చేసిందా? తెలంగాణ హైకోర్టు ఆగ్రహం

గతేడాది వర్షాలతో పంట నష్టపోయిన రైతులకు పరిహారం అందించడంపై రాష్ట్రప్రభుత్వం మాట మార్చడాన్ని తెలంగాణ హైకోర్టు తప్పుపట్టింది. రాష్ట్రంలో 33శాతం పంట నష్టపోయారని, రైతులకు పరిహారం అందించడానికి సహాయం చేయాలని కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాసిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఒక్క ఎకరా పంట కూడా నష్టపోలేదని వాదించడం విచిత్రంగా ఉన్నదని విస్మయం వ్యక్తం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఏం అద్భుతం చేసిందని నిలదీసింది.
 

telangana high court slams KCR govt for ignoring compensation to flood hit farmers
Author
Hyderabad, First Published Sep 18, 2021, 6:07 PM IST

హైదరాబాద్: అప్పుడే పంట నష్టం జరిగిందని, సహాయం చేయాలని కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లేఖలు రాసి, మళ్లీ అదే ప్రభుత్వం అసలు పంట నష్టమే జరగలేదని చెప్పడమేంటని తెలంగాణ హైకోర్టు ప్రశ్నించింది. గతేడాది అక్టోబర్‌లో భారీగా కురిసిన వర్షాల దాటికి రాష్ట్రంలో 33శాతం అంటే సుమారు 5.65 లక్షల ఎకరాల్లో రైతులు పంట నష్టపోయారని స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రధాన కార్యదర్శి కేంద్రానికి లేఖ రాశారు. ఇప్పుడు ఒక్క ఎకరంలోనూ పంట నష్టం లేదని వాదిస్తున్నారని తెలిపింది. పంట నష్టంపై రాష్ట్ర ప్రభుత్వం ఏం అద్భుతం చేసిందని అడిగింది. రూ. 595 కోట్ల పరిహారం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని అడిగితే కేంద్ర బృందాలు పరిశీలించి రూ. 186 కోట్ల వరకు నష్టం వాటిల్లిందని నిర్ధారించాయని, పంటనష్టం జరిగిందనడానికి కచ్చితమైన ఆధారాలున్నా అసలు నష్టమే జరగలేదని ఎలా చెబుతారని నిలదీసింది.

ఈ వ్యాఖ్యలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున వాదిస్తున్న ఏజీ బీఎస్ ప్రసాద్ స్పందించారు. తొలుత నష్టం వచ్చిందని భావించామని, కానీ, రైతులు, అధికారుల సకాలచర్యలతో సమర్థంగా ఎదుర్కొన్నామని నివేదించారు. అలాంటప్పుడు అసలు పంట నష్టం జరగలేదని కేంద్రానికి లేఖలు రాసి ఆర్థిక సహాయం అవసరం లేదని ఎందుక విస్పష్టపరచలేదని న్యాయస్థానం అడిగింది. మరోవైపు విపత్తుల నిధి రాష్ట్ర ప్రభుత్వానికి అందించామని, వాటిని ప్రభుత్వం వినియోగించుకోవచ్చని కేంద్ర ప్రభుత్వ న్యాయవాది అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ రాజేశ్వరరావు అన్నారు. వరదలతో పంట నష్టపోయిన రైతులకు పరిహారం అందించాలని ప్రభుత్వాన్ని ఆదేశించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ రైతు స్వరాజ్య వేదిక ప్రతినిధులు కిరణ్ కుమార్, రవి కన్నెగంటి, ఎస్ ఆశాలతలు దాఖలు చేసిన పిల్‌ను తాత్కాలిక సీజే ఎంఎస్ రామచందర్‌రావు, జస్టిస్ వినోద్‌ కుమార్‌ల ధర్మాసనం విచారిస్తున్నది.

ఒకవేళ భారీ వర్షాలకు పంటలు నష్టపోయి ఉంటే రైతులే హైకోర్టును ఆశ్రయించి పరిహారం చెల్లించడానికి ప్రభుత్వాన్ని ఆదేశించాలని అడిగేవారని ఏజీ అన్నారు. ఈ వాదనను హైకోర్టు ఖండించింది. రైతులందరూ కోర్టుకు రాలేరని, వారి పంట నష్టపరిహారం, ఇన్‌పుట్ సబ్సిడీల కోసం దాఖలయ్యే ఇలాంటి ప్రజాహిత వ్యాజ్యాల విచారణతోనే రైతులకు న్యాయం జరుగుతుందని అభిప్రాయపడింది.

గతేడాది అక్టోబర్‌లో వర్షాలతో నష్టపోయిన హైదరాబాద్ నివాసులకు రూ. 500 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం పరిహారంగా అందజేసిందని, ఇంటికి రూ. 10వేల చొప్పున పంచిందని పిటిషనర్లు తెలిపారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఇక్కడ విచ్చలవిడిగా డబ్బు పంచిన రాష్ట్ర ప్రభుత్వం పంట నష్టపోయిన రైతులపై మాత్రం వివక్ష చూపిందని ఆరోపించారు. ఈ వాదనలు విన్న ధర్మాసనం తీర్పును రిజర్వ్‌లో పెట్టింది.

Follow Us:
Download App:
  • android
  • ios