Asianet News TeluguAsianet News Telugu

ఎందుకింత జాప్యం.. ఇంకా ఎంత మంది మరణించాలి .. కేంద్రంపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం

కరోనా ఔషధాలను అత్యవసర జాబితాలో చేర్చడంలో జాప్యంపై కేంద్రంపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇంకా ఎంత మంది మరణించాక చేరుస్తారని కేంద్రంపై మండిపడింది. అక్టోబరు 31లోగా అత్యవసర జాబితాలో చేర్చాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించిన హైకోర్టు.. తదుపరి విచారణ అక్టోబరు 4కి వాయిదా వేసింది.  

telangana high court  serious on center over covid medicines
Author
Hyderabad, First Published Sep 22, 2021, 4:33 PM IST

తెలంగాణలో రానున్న మూడు నెలల్లో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. రాష్ట్రంలో కొవిడ్‌ పరిస్థితులపై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది. విద్యా సంస్థల్లోనూ సిబ్బందికి రెండు నెలల్లో వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని పేర్కొంది. రాష్ట్రంలో ఆర్టీపీసీఆర్ పరీక్షల సంఖ్య పెంచాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. కలర్ కోడెడ్ గ్రేడెడ్ రెస్పాన్స్ (సీసీజీఆర్‌ఏ) కార్యాచరణ ప్రణాళికలో జాప్యంపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఇప్పటికే రెండు సార్లు ఆదేశించినప్పటికీ ఎందుకు సమర్పించలేదని రాష్ట్ర ప్రజారోగ్య శాఖ సంచాలకులు (డీహెచ్) డా. శ్రీనివాస్‌ను ప్రశ్నించింది.  

సీసీజీఆర్‌ఏపై ప్రభుత్వం ఉన్నత స్థాయిలో విధాన నిర్ణయం తీసుకోవాల్సి ఉందని ఈ సందర్భంగా డీహెచ్‌ కోర్టుకు వివరించారు. ప్రభుత్వ పాలసీలే అమలు చేస్తారా?కోర్టు ఆదేశాలు అమలు చేయరా?అని ప్రశ్నించింది. న్యాయస్థానం ఆదేశాలు అమలు చేయకపోతే పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హైకోర్టు హెచ్చరించింది. ఈనెల 30లోగా సీసీజీఆర్ఏ రూపొందించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. కరోనా ఔషధాలను అత్యవసర జాబితాలో చేర్చడంలో జాప్యంపైనా న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇంకా ఎంత మంది మరణించాక చేరుస్తారని కేంద్రంపై మండిపడింది. అక్టోబరు 31లోగా అత్యవసర జాబితాలో చేర్చాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించిన హైకోర్టు.. తదుపరి విచారణ అక్టోబరు 4కి వాయిదా వేసింది.  

రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై డీహెచ్‌ శ్రీనివాస్‌ హైకోర్టుకు నివేదిక సమర్పించారు. తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటివరకు 2.58 కోట్ల కరోనా పరీక్షలు నిర్వహించాం. ఈనెల 19వ తేదీ వరకు 6,63,450 కేసులు నమోదయ్యాయని శ్రీనివాస్ వివరించారు. గత రెండు నెలల్లో పాజిటివిటీ రేటు 0.51 శాతానికి తగ్గిందని చెప్పారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 2.20 కోట్ల డోసుల వ్యాక్సిన్లు వేశాం. 180 మొబైల్ వ్యాక్సినేషన్‌ కేంద్రాల ద్వారా 10.07 లక్షల మందికి వ్యాక్సిన్లు వేశాం. ఈనెల 16 నుంచి ప్రత్యేక డ్రైవ్ ద్వారా 25.10 లక్షల మందికి వ్యాక్సిన్లు వేశాం. జీహెచ్ఎంసీ పరిధిలో 97 శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేశాం.   రాష్ట్రంలో 60శాతం మందికి మొదటి డోస్ పూర్తయింది. 38 శాతం మంది రెండు డోసులు తీసుకున్నారని హైకోర్టుకు ఇచ్చిన నివేదికలో శ్రీనివాస్ తెలిపారు. 

Follow Us:
Download App:
  • android
  • ios