హైదరాబాద్: రాష్ట్ర సరిహద్దుల్లో అంబులెన్స్‌లను నిలిపివేయడం వల్ల ప్రాణాలు కోల్పోతే ఎవరు బాధ్యత వహించాలని తెలంగాణ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. తెలంగాణ రాష్ట్రంలో  కరోనా పరిస్థితులపై ఇవాళ మధ్యాహ్నం రెండున్నర గంటలకు  హైకోర్టులో విచారణ ప్రారంభమైంది. ఛత్తీస్‌ఘడ్, మహారాష్ట్ర, కర్ణాటక నుండి ఆర్‌ఎంపీ డాక్టర్ల ప్రిస్కిప్షన్ స్ తో  రోగులు  రాష్ట్రానికి వస్తున్నారని అడ్వకేట్ జనరల్  హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు.  హైద్రాబాద్ మెడికల్ హబ్ కావడంతో వైద్యం కోసం ఇక్కడికి పెద్ద ఎత్తున వస్తుంటారని హైకోర్టు అభిప్రాయపడింది. వైద్యం కోసం వచ్చేవారిని ఎలా అడ్డుకొంటారని హైకోర్టు ప్రశ్నించింది.

also read:తెలంగాణలో రేపటి నుంచే లాక్ డౌన్: నియమాలు ఇవీ..

also read:సరిహద్దుల్లో అంబులెన్స్‌లను ఎందుకు ఆపారు: తెలంగాణ సర్కార్‌ను ప్రశ్నించిన హైకోర్టు

సరిహద్దుల్లో అంబులెన్స్ లు నిలిపివేయడంపై  రేపు నిర్ణయం తీసుకొంటామని ఏజీ హైకోర్టుకు తెలిపారు. అయితే రేపటివరకు ఎన్ని ప్రాణాలు పోవాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. కరోనాపై విచారణ ప్రారంభించగానే ఈ నెల 12 నుండి రాష్ట్రంలో లాక్‌డౌన్ అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొన్న విషయాన్ని ఏజీ హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు.