Asianet News TeluguAsianet News Telugu

సరిహద్దుల్లో అంబులెన్స్‌లను ఎందుకు ఆపారు: తెలంగాణ సర్కార్‌ను ప్రశ్నించిన హైకోర్టు

రాష్ట్రంలో కరోనా పరీక్షలు తగ్గడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం నాడు  హైకోర్టుకు స్టేటస్ రిపోర్టు ఇచ్చింది.

Telangana Government serious comments on Corona cases lns
Author
Hyderabad, First Published May 11, 2021, 11:17 AM IST

హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా పరీక్షలు తగ్గడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం నాడు  హైకోర్టుకు స్టేటస్ రిపోర్టు ఇచ్చింది.కరోనా పరిస్థితులపై తెలంగాణ ప్రభుత్వం తీరుపై కొంత కాలంగా హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే.  ఇవాళ స్టేటస్ రిపోర్టు ఇచ్చిన సమయంలో కూడ  కరోనా విషయమై ప్రభుత్వ తీరును హైకోర్టు తప్పుబట్టింది.

తెలంగాణ రాష్ట్ర సరిహద్దుల్లో అంబులెన్స్ లను  అడ్డుకోవడం దారుణమని హైకోర్టు అభిప్రాయపడింది. అంబులెన్స్ లను అడ్డుకోవాలని మీకు ఎవరు చెప్పారని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.రోజూ లక్ష మందికి కరోనా టెస్టులు నిర్వహించాలని చెప్పినా కూడ ఎందుకు టెస్టులు చేయడం లేదని హైకోర్టు ప్రశ్నించింది.  టెస్టులు ఎందుకు తగ్గించారో సమాధానం చెపాలని కోరింది. కోర్టు ధిక్కరణ నోటీసులు ఇస్తామని హైకోర్టు హెచ్చరించింది.

నైట్ కర్ఫ్యూ నిబంధనలు అమలు కావడం లేదని హైకోర్టు తెలిపింది. నిబంధనల ఉల్లంఘనలపై లేఖలు, మెయిల్స్ వస్తున్నాయని హైకోర్టు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చింది. పాతబస్తీలో నిబంధనలు పాటించాలని జామియా నిజామియా సంస్థ ఫత్వా జారీ చేసిందని అడ్వకేట్ జనరల్ హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఫత్వాలతో తమకు పనిలేదు, కోర్టు ఆదేశాలను అమలు చేయాల్సిందేనని హైకోర్టు తేల్చి చెప్పింది.

గత విచారణలో ఎక్స్‌‌పర్ట్ కమిటీ వేయమని చెప్పాం వేశారా? అని హైకోర్టు ప్రశ్నించింది. పలు అంశాలపై రాష్ట్ర ప్రభుత్వంపై హైకోర్టు ప్రశ్నల వర్షం కురిపించింది. ‘‘అంతర్ రాష్ట్ర సరిహద్దుల వద్ద అంబులెన్స్ ఆపమని ఎవరు చెప్పారు? ఈ సమయంలో అంబులెన్స్‌లు ఆపడం మానవత్వమా? అంబులెన్స్ రేటులను నియంత్రించాలని చెప్పాం.. చేశారా? రాష్ట్రంలో జరుగుతున్న వాటికి పూర్తి బాధ్యత ప్రభుత్వమే వహించాల్సి ఉంటుందని హైకోర్టు హెచ్చరించింది..

కుంభ మేళా నుంచి తిరిగి వచ్చిన వారిని గుర్తించి టెస్ట్‌లు చేయాలని చెప్పాం చేశారా? పాతబస్తీ వంటి ప్రాంతాల్లో మత పరమైన కార్యక్రమాలను ఎందుకు నియంత్రించడం లేదు? రంజాన్ తరువాత లాక్‌డౌన్ పెడతారా? ఈ లోపే వైరస్ విజృంభిస్తుంది కదా? మేం ఆదేశాలు ఇచ్చిన రోజు హుటాహుటిన ప్రెస్ మీట్ లు పెట్టి పరిస్థితి అంతా బాగుంది లాక్‌డౌన్ అవసరం లేదని ఎలా చెప్తారు? యాక్టివ్ కేసులు ఎందుకు తగ్గుతున్నాయి? మేం టెస్ట్‌ల సంఖ్య పెంచాలని చెబితే అందుకు భిన్నంగా తగ్గించారు - హై కోర్టు అంటే మీ ప్రభుత్వానికి లెక్క లేదా?’’ అని ధర్మాసనం ప్రశ్నించింది.

 రంజాన్ తర్వాత లాక్‌డౌన్ పెడదామని అనుకొంటున్నారా అని హైకోర్టు ప్రశ్నించింది. అప్పటిలోపుగా కరోనా ఎంత వ్యాప్తి చెందుతుందో తెలుసా అని హైకోర్టు ప్రశ్నించింది. మతం ముఖ్యం కాదు, మానవత్వం, మనుషుల ప్రాణాలు  ముఖ్యమని హైకోర్టు స్పష్టం చేసింది.  మధ్యాహ్నం రెండున్నర గంటలకు లాక్‌డౌన్ లేదా నైట్ కర్ఫ్యూపై కేబినెట్ నిర్ణయాన్ని తెలుపుతామని అడ్వకేట్ జనరల్ హైకోర్టుకు చెప్పారు. దీంతో తదుపరి విచారణను ఇవాళ మధ్యాహ్నానికి హైకోర్టు వాయిదా వేసింది. హైకోర్టు విచారణకు హాజరైన హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనర్లు హాజరయ్యారు. ఇవాళ తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. లాక్‌డౌన్  పై ఈ సమావేశంలో మంత్రివర్గం చర్చించి కీలక నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. 

Follow Us:
Download App:
  • android
  • ios