బుద్వేల్ భూముల ఈ వేలం: బార్ అసోసియేషన్ పిటిషన్ ను నిరాకరించిన తెలంగాణ హైకోర్టు
బుద్వేల్ భూముల వేలంపై బార్ అసోసియేషన్ దాఖలు చేసిన పిటిషన్ ను తెలంగాణ హైకోర్టు తిరస్కరించింది.
హైదరాబాద్: బుద్వేల్ భూముల వేలంపై బార్ అసోసియేషన్ దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్ ను తెలంగాణ హైకోర్టు గురువారంనాడు నిరాకరించింది. బుద్వేల్ భూములు హైకోర్టు నిర్మాణానికి కేటాయించాలని టీహెచ్ఏఏ పిల్ దాఖలు చేసింది. హైకోర్టు న్యాయవాదుల సంఘం తరపున టీహెచ్ఏఏ కార్యదర్శి ప్రదీప్ రెడ్డి పిల్ దాఖలు చేశారు.
అధ్యక్షుడు, కార్యవర్గంతో చర్చించాలని పిటిషనర్ కు హైకోర్టు సూచించింది.హైకోర్టు తరలింపుపై భిన్నాభిప్రాయాలు ఉన్నందున చర్చించుకోవాలని సూచించింది. అందరూ ఏకాభిప్రాయంతో వస్తే వాదనలు వింటామని హైకోర్టు తెలిపింది.ఇవాళ ఉదయం 11 గంటలకు ఈ వేలం ప్రారంభం కానున్నందున వేలంపై స్టే ఇవ్వాలని న్యాయవాదులు కోరారు. స్టే ఇచ్చేందుకు కూడ హైకోర్టు నిరాకరించింది.
బుద్వేల్ ఓఆర్ఆర్ పక్కన ఉన్న 100 ఎకరాల్లో 14 ప్లాట్లను విక్రయించాలని హెచ్ఎండీఏ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఇవాళ ఈ వేలం వేస్తున్నారు. రెండు విడతలుగా ఈ వేలం సాగనుంది. ఎకరం భూమికి రూ. 20 కోట్లుగా హెచ్ఎండీఏ నిర్ణయించింది. బుద్వేల్ భూములను దక్కించుకొనేందుకు పలు బడా కంపెనీలు వేలంలో పాల్గొనేందుకు ఆసక్తిని చూపుతున్నాయి. గత వారంలో కోకాపేటలో హెచ్ఎండీఏ భూములను విక్రయించింది. ఈ భూములకు రికార్డు ధర పలికింది. కోకాపేట తరహలోనే బుద్వేల్ భూములకు కూడ మంచి ధర పలికే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.