హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా మరణాల రిపోర్టుపై  తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రతి రోజూ కరోనాతో ఎనిమిది నుండి 10 మంది మాత్రమే చనిపోతున్నారా అని హైకోర్టు ప్రశ్నించింది. కరోనాతో మరణించిన వారి సంఖ్యను తక్కువ చేసి చూపుతున్నారని హైకోర్టు అభిప్రాయపడింది.

తెలంగాణలో కరోనా పరిస్థితులపై హైకోర్టు శుక్రవారంనాడు విచారించింది. కరోనా మరణాలపై కచ్చితమైన రిపోర్టు ఇవ్వాలని ఆదేశించింది. తప్పుడు రిపోర్టులు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని మరోసారి కోర్టుకు పిలవాల్సి వస్తోందని హైకోర్టు హెచ్చరించింది. 

తాము కోరిన అన్ని రకాల నివేదికలను ఈ నెల 22వ తేదీ లోపుగా ఇవ్వాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మరో వైపు అధిక ఫీజులు వసూలు చేసిన ప్రైవేట్ ఆసుపత్రులపై చర్యలు తీసుకోవడంలో వ్యత్యాసం ఉందని పిటిషనర్ హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు.

తెలంగాణ రాష్ట్రంలో అధిక ఫీజులు వసూలు చేసిన ఆసుపత్రులపై ఈ నెల 22వరకు నివేదిక ఇవ్వాలని  తెలంగాణ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.పలు ఆసుపత్రుల్లో ప్రభుత్వం నిర్ధేశించిన  ఫీజుల కంటే అధిక ఫీజులు వసూలు చేసినట్టుగా పెద్ద ఎత్తున కథనాలు వచ్చాయి.ఈ విషయమై హైకోర్టు కూడ విచారణ సందర్భంగా ప్రశ్నించింది. అధిక ఫీజులు వసూలు చేసిన ఆసుపత్రులపై 22వ తేదీ వరకు నివేదిక ఇవ్వాలని కోరింది.

గతంలో కూడ ఎక్కువ పీజులు వసూలు చేసిన ఆసుపత్రులపై చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అధిక పీజులు వసూలు చేసిన ప్రైవేట్ ఆసుపత్రులపై ఎందుకు చర్యలు తీసుకోలేదో చెప్పాలని కూడ కోర్టు ప్రశ్నించిన విషయం తెలిసిందే.

డిజాస్టర్ మేనేజ్ మెంట్ ప్లాన్స్ ఏ విధంగా ఉన్నాయో కూడ తమకు నివేదిక ఇవ్వాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది.డిజాస్టర్ మేనేజ్ మెంట్ తో ఎలాంటి చర్యలు చేపట్టారో తెలపాల్సిందిగా కోరింది.పబ్లిక్ హెల్త్ పై ఖర్చు పెట్టిన నివేదికను కూడ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది హైకోర్టు.

50 శాతం బెడ్స్ ఢిల్లీ ప్రభుత్వం తరహలో వ్యవహరించాలని ప్రభుత్వానికి హైకోర్టు సూచించింది. తెలంగాణలో ఎలా వ్యవహరించారో నివేదిక ఇవ్వాలని కోరింది. ఈ కేసు విచారణను ఈ నెల 24వ తేదీకి హైకోర్టు వాయిదా వేసింది.