ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లకు ఎదురుదెబ్బ తగిలింది. అనుమతులు లేకుండా విద్యుత్ స్తంభాలకు కట్టిన కేబుల్ వైర్లను తొలగించాల్సిందేనని హైకోర్టు ఆదేశించింది. 

Hyderabad : కేబుల్ ఆపరేటర్లు, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ కు తెలంగాణ హైకోర్ట్ షాక్ ఇచ్చింది. ఎట్టి పరిస్థితుల్లో విద్యుత్ స్తంభాలకు కేబుల్ వైర్లను ప్రమాదకరంగా కడతామంటే చూస్తూ ఊరుకోమనేలా గట్టిగానే వార్నింగ్ ఇచ్చింది న్యాయస్థానం. ఇకపై కేవలం అనుమతి పొందిన కేబుల్స్ తప్ప మిగతావి విద్యుత్ స్తంభాలకు ఉంచకూడదని న్యాయస్థానం ఆదేశాలు జారీచేసింది.

ఇష్టం వచ్చినట్లుగా విద్యుత్ స్తంబాలను కేబుల్ వైర్లతో నింపకూడదని హైకోర్ట్ న్యాయమూర్తి జస్టిస్ నాగేష్ ఆదేశించింది. ఇలా విద్యుత్ శాఖ కేబుల్ వైర్స్ తొలగింపుకోసం చేపట్టిన స్పెషల్ డ్రైవ్ కు హైకోర్టు అనుమతి ఇచ్చింది. ఇప్పటికే కొన్నిప్రాంతాల్లో కేబుల్ వైర్ల తొలగింపు ప్రక్రియ కొనసాగుతుండగా హైకోర్టు ఆదేశాలతో ఇది హైదరాబాద్ వ్యాప్తంగా జరగనుంది.

ఎందుకు కేబుల్ వైర్ల తొలగిస్తున్నారు?

హైదరాబాద్ రామంతాపూర్ లో శ్రీకృష్ణాష్టమి సందర్భంగా చేపట్టిన ఊరేగింపు విద్యుత్ ప్రమాదంతో విషాదాంతమయ్యింది. మనుషులు లాగుతున్న రథం విద్యుత్ తీగలకు తాకడంతో ఒక్కసారిగా కరెంట్ షాక్ తగిలి ఐదుగురు మరణించారు... మరికొందరు తీవ్ర గాయాలతో హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనకు విద్యుత్ స్తంభాలకు వేలాడదీసిన కేబుల్ వైర్లే కారణమని అధికారులు గుర్తించారు. దీంతో ప్రభుత్వం సీరియస్ యాక్షన్ చేపట్టింది... నగరంలోని విద్యుత్ స్తంభాలకు ఉన్న కేబుల్ వైర్లను తొలగించాలని విద్యుత్ శాఖను ఆదేశించింది. దీంతో హైదరాబాద్ లో కేబుల్ వైర్స్ తొలగింపు ప్రక్రియ ప్రారంభమయ్యింది.

ప్రభుత్వ నిర్ణయంతో కేబుల్ ఆపరేటర్లు, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ ఆందోళనకు గురవుతున్నారు. విద్యుత్ శాఖ కేబుల్ వైర్లు తొలగించడంతో వారి సర్వీసులకు అంతరాయం ఏర్పడటంతో కస్టమర్ల నుండి కంప్లైంట్స్ ఎక్కువయ్యాయి. దీంతో ప్రభుత్వం వైర్ల తొలగింపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేలా ఆదేశాలివ్వాలంటూ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఇలా ఎయిర్ టెల్ సంస్థ దాఖలుచేసిన పిటిషన్ ను ఇవాళ(శుక్రవారం) న్యాయస్థానం విచారించింది. ఈ సందర్భంగా రామంతాపూర్ ఘటనను గుర్తుచేస్తూ ఎమోషనల్ కామెంట్స్ చేసిన న్యాయమూర్తి కేబుల్ వైర్ల తొలగింపు నిర్ణయాన్ని సమర్దించారు.

ప్రజల ప్రాణాలతో చెలగాటమా..: హైకోర్టు సీరియస్

విద్యుత్ స్తంభాలకు కేబుల్ వైర్లను వేలాడదీస్తూ, ఇష్టం వచ్చినట్లు వైర్లను లాగి కనెక్షన్లు ఇచ్చుకుంటామంటే కుదరదని ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లను న్యాయస్థానం హెచ్చరించింది. రామంతాపూర్ లో విద్యుత్ షాక్ తో ఐదుగురు చనిపోయిన ఘటననను న్యాయమూర్తి జస్టిస్ నగేష్ ప్రస్తావించారు. పుట్టినరోజునాడే మరణించిన తండ్రికి 9 ఏళ్ల బాలుడు తలకొరివి పెట్టాడంటూ న్యాయమూర్తి ఎమోషనల్ వ్యాఖ్యలు చేశారు. తండ్రితో కలిసి ఆనందంగా కేక్ కట్ చేయాలనుకున్న బాలుడు కన్నీరుపెడుతూ తలకొరివి పెట్టాడని జస్టిస్ నగేష్ ఉద్వేగభరిత వ్యాఖ్యలు చేశారు.

దారుణ ప్రమాదం జరిగి మనుషులు చనిపోతే తమ తప్పేమీ లేదన్నట్లుగా ఎవరికివారు చేతులు దులుపుకుంటే ఎలా? అని జస్టిస్ నగేష్ ప్రశ్నించారు. అమాయక ప్రజల ప్రాణాలు పోయాయి... దీనికి బాధ్యులెవరు? అని పిటిషనర్లను నిలదీశారు. ఇలాంటి ఘటనలు జరక్కుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని న్యాయమూర్తి పేర్కొన్నారు. అందుకే జిహెచ్ఎంసి నుండి లైసెన్స్ తీసుకున్న కేబుల్స్ తప్ప మిగతావి విద్యుత్ స్తంభాలకు ఉంచకూడదని తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నగేష్ ఆదేశించారు.