కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఉస్మానియా యూనివర్సిటీ ‌ పర్యటకు వర్సిటీ అధికారులు అనుమతి నిరాకరించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే రాహుల్ గాంధీ ఓయూలో నిర్వహించే కార్యక్రమానికి అనుమతివ్వాలని విద్యార్థి సంఘం నాయకులు హైకోర్టును ఆశ్రయించారు.

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఉస్మానియా యూనివర్సిటీ ‌ పర్యటకు వర్సిటీ అధికారులు అనుమతి నిరాకరించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే రాహుల్ గాంధీ ఓయూలో విద్యార్థుల‌తో ముఖాముఖికి నిర్వహించేందుకు అనుమ‌తి ఇవ్వాలంటూ హైకోర్టులో ఎన్ఎస్యూఐ సభ్యులైన మానవతా రాయ్ స‌హా న‌లుగురు పిటిష‌న్ దాఖ‌లు చేశారు. ఓయూ అధికారులు స్పందించడం లేదని పేర్కొన్నారు. ఈ పిటిషన్‌పై హైకోర్టు నేడు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా విద్యార్థుల పిటిషన్‌ను పరిశీలించాలని ఓయూ అధికారులను హైకోర్టు ఆదేశించింది. 

అయితే విచారణ సమయంలో రాష్ట్ర ప్రభుత్వం, ఓయూ తరఫున న్యాయవ్యాదులు హాజరు కాలేదు. వీసీకి మరోసారి దరఖాస్తు చేసుకోవాలని పిటిషనర్‌కు హైకోర్టు సూచించింది. కాగా రాహుల్‌ పర్యటన అనుమతిని హైకోర్టు ఓయూ వైస్ ఛాన్సలర్ నిర్ణయానికి వదిలేసింది. ఇక, ఈ పిటిషన్‌‌పై విచారణను హైకోర్టు ముగించింది.

ఇక, ఓయూలో ఓయూలో రాహుల్ పర్యటనకు వీసీ అనుమతి నిరాకరించారు. రాజకీయ సభలకు ఓయూలో అనుమతివ్వకూడదని పాలక మండలి నిర్ణయం తీసుకుందని చెప్పారు. ఇతర సంఘాల నుంచి అభ్యంతరాలు ఉన్నాయని తెలిపారు. శాంతిభద్రతలను కూడా పరిగణలోకి తీసుకుని అనుమతి ఇవ్వడం లేదని వెల్లడించారు. ఓయూలో అధికారుల సంఘం ఎన్నికల షెడ్యూల్ విడుదలైందని తెలిపారు. 

మరోవైపు నేడు కూడా ఓయూలో ఎన్‌ఎస్‌యూఐ నాయకులు నిరసన వ్యక్తం చేయగా.. పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. రాహుల్ గాంధీ ఓయూను సందర్శించడానికి అనుమతివ్వాలని కోరుతున్నారు. ఈ క్రమంలోనే యూనివర్సిటీలో పోలీసులు మోహరించారు. యూనివర్సిటీలోకి వచ్చే వాహనాలను పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. దీంతో ప్రస్తుతం ఓయూలో టెన్షన్ వాతావరణం కొనసాగుతుంది.

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఈ నెల 6,7 తేదీల్లో తెలంగాణలో పర్యటించనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే 7వ తేదీన ఉస్మానియా యూనివర్సిటీలో రాహుల్ గాంధీ సందర్శనకు అనుమతి ఇవ్వాలని కాంగ్రెస్‌ నేతలు కోరుతున్న సంగతి తెలిసిందే. రాజకీయాలకు అతీతంగా రాహుల్‌ ఓయూకి వస్తారని వారు చెబతున్నారు. 

ఇక, ఈ రోజు రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటనకు వస్తున్నారని.. ఉస్మానియా యూనివర్సిటీ సందర్శిస్తారని చెప్పారు. రాహుల్‌గాంధీ ఓయూ విద్యార్థులతో మాట్లాడనున్నారని తెలిపారు. యూజీసీ నిధులు సరిగా వినియోగం అవుతున్నాయా? లేదా? తెలుసుకుంటారని అన్నారు. ఓయూలో నియామకాలు సరిగా జరుగుతున్నాయా? లేదా? రాహుల్ గాంధీ తెలుసుకుంటారని చెప్పారు. రాహుల్ గాంధీ ఓయూ సభకు అనుమతి అడిగినందుకు విద్యార్థి నాయకులపై అక్రమ కేసులు పెట్టి.. జైలులో పెట్టారని మండిపడ్డారు.