Asianet News TeluguAsianet News Telugu

బీజేపీ, సిట్ పిటిషన్‌లపై హైకోర్టులో విచారణ.. బీఎల్ సంతోష్‌కు నోటీసులపై స్టేకు నో.. కీలక ఆదేశాలు..

టీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలకు ప్రలోభాల కేసుకు సంబంధించి సిట్ నోటీసులపై దాఖలైన పిటిషన్లపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. 

Telangana High Court On SIT Notices in TRS MLAs Poaching CAse
Author
First Published Nov 19, 2022, 2:43 PM IST

టీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలకు ప్రలోభాల కేసుకు సంబంధించి సిట్ నోటీసులపై దాఖలైన పిటిషన్లపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్, కరీంనగర్‌కు చెందిన న్యాయవాది శ్రీనివాస్‌లకు సిట్ నోటీసులు జారీ చేయడాన్ని సవాలు చేస్తూ బీజేపీ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు బీఎల్ సంతోష్‌కు నేరుగా నోటీసులు ఇచ్చేందుకు సహకరించేలా ఢిల్లీ పోలీసులను ఆదేశించాలని ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సిట్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌లపై విచారణ చేపట్టిన హైకోర్టు.. బీఎల్ సంతోష్, న్యాయవాది శ్రీనివాస్‌లకు సిట్ నోటీసులపై స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. అయితే తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకు సంతోష్‌, శ్రీనివాస్‌ను అరెస్ట్ చేయవద్దని హైకోర్టు ఆదేశించింది. 

బీఎల్ సంతోష్, శ్రీనివాస్‌లకు నోటీసులు ఇవ్వడం మీడియాకు ఎలా లీక్ అవుతున్నాయని హైకోర్టు ప్రశ్నించింది. బీఎల్ సంతోష్, శ్రీనివాస్‌లు సిట్ దర్యాప్తుకు సహకరించాలని హైకోర్టు ఆదేశించింది. సిట్ నోటీసులు బీఎల్ సంతోష్‌కు ఇచ్చేందుకు ఢిల్లీ పోలీసులు సహకరించాలని సూచింది. సిట్ అధికారులు బీఎల్ సంతోష్‌కు ఇవ్వాల్సిన నోటీసులు ఢిల్లీ పోలీసులకు ఇవ్వాలని..  వారు నోటీసును ఆయనకు సర్వ్ చేస్తారని పేర్కొంది. తదుపరి విచారణను హైకోర్టు మంగళ వారానికి వాయిదా వేసింది. 

ఇదిలా ఉంటే.. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ప్రలోభాల కేసులో హైదరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ నేతృత్వంలోని సిట్ దర్యాప్తు వేగవంతం చేసింది. ఈ క్రమంలోనే బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్, కరీంనగర్‌కు చెందిన న్యాయవాది శ్రీనివాస్‌లతో పాటుకు సిట్ నోటీసులు జారీ చేసింది. హైదరాబాద్‌లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లోని కార్యాలయంలో నవంబర్ 21న ఉదయం 10.30 గంటలకు సిట్ ఎదుట హాజరుకావాలని 41ఏ సీఆర్పీసీ నోటీసు జారీ చేసింది. విచారణకు హాజరుకాకపోతే అరెస్ట్ చేయాల్సి వస్తుందని స్పష్టం చేసింది.

విచారణ అధికారి హోదాలో అసిస్టెంట్ కమీషనర్ ఆఫ్ పోలీస్ పి గంగాధర్  ఈ నోటీసులు జారీ చేశారు. నోటీసులు అందిన తర్వాత మొబైల్స్‌లోని డేటాను ట్యాంపర్ చేయవద్దని నోటీసుల్లో పేర్కొన్నారు. అలాంటి ప్రయత్నం చేస్తే ప్రాసిక్యూషన్‌కు గురవుతామని హెచ్చరించారు. విచారణాధికారులకు సమాచారం ఇవ్వకుండా దేశం విడిచి వెళ్లరాదని కూడా నోటీసుల్లో పేర్కొన్నారు. 

అయితే బీఎల్ సంతోష్, న్యాయవాది శ్రీనివాస్‌లకు సిట్ నోటీసులు జారీచేయడాన్ని సవాలు చేస్తూ బీజేపీ శుక్రవారం హైకోర్టును ఆశ్రయించింది. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి హైకోర్టులో లంచ్‌మోషన్ పిటిషన్  దాఖలు చేశారు. కేసును పర్యవేక్షిస్తున్న సింగిల్ జడ్జి అనుమతి పొందిన తర్వాతే సిట్ నోటీసులు జారీ చేయాలని పేర్కొంటూ.. నోటీసులపై స్టే విధించాలని కోరారు. ఈ పిటిషన్‌లో ఎనిమిది మందిని ప్రతివాదులుగా చేర్చారు. తెలంగాణ ప్రభుత్వం, డీజీపీ,  సైబారాబాద్ పోలీస్ కమిషనర్, ఏసీపీ రాజేంద్రనగర్, సీహెచ్‌వో మొయినాబాద్, సెంట్రల్ హోమ్ ఎఫైర్స్, సీబీఐ, రోహిత్ రెడ్డిలను పిటిషనర్ ప్రతివాదులుగా చేర్చారు. కుట్రలో భాగంగానే ఆయనకు 41ఏ కింద నోటీసులు ఇచ్చారని ఆరోపించారు. బీఎల్ సంతోష్, లాయర్ శ్రీనివాస్కు నోటీసుల్లో ఒకే సెల్ నెంబర్ పెట్టారని చెప్పారు. దర్యాప్తు పేరుతో కేసుకు సంబంధం లేని వాళ్లను వేధించేందుకు కుట్ర జరుగుతోందని ఆరోపించారు. సిట్‌‌ నోటీసులపై స్టే ఇవ్వాలని.. ఈ పిటిషన్‌ను అత్యవసరంగా విచారించాలని కోరారు. 

మరోవైపు.. ఈ కేసును విచారిస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) తెలంగాణ హైకోర్టులో లంచ్ మోహన్ పిటిషన్ దాఖలు చేసింది. ఢిల్లీ పోలీసులు విచారణకు సహకరించడం లేదని పిటిషన్‌లో సిట్‌ పేర్కొంది. ఓ వ్యక్తికి నోటీసులు ఇచ్చేందుకు ఢిల్లీ పోలీసులు అనుమతించలేదని తెలిపింది. దర్యాప్తుకు అంతరాయం కలిగించకుండా ఢిల్లీ పోలీసులను ఆదేశించాలని సిట్‌ కోర్టును కోరింది. 

Follow Us:
Download App:
  • android
  • ios