కామారెడ్డి మాస్టర్ ప్లాన్ వివాదంపై తెలంగాణ హైకోర్టులో ఈరోజు విచారణ జరిగింది. కామారెడ్డి మాస్టర్‌ ప్లాన్‌కు సంబంధించి ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ధర్మాసనం విచారణ చేపట్టింది

కామారెడ్డి మాస్టర్ ప్లాన్ వివాదంపై తెలంగాణ హైకోర్టులో ఈరోజు విచారణ జరిగింది. కామారెడ్డి మాస్టర్‌ ప్లాన్‌కు సంబంధించి ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ధర్మాసనం విచారణ చేపట్టింది. విచారణ సందర్భంగా కామారెడ్డి మాస్టర్ ప్లాన్‌ను హోల్డ్‌లో పెట్టామని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. ప్రజల అభ్యంతరాలను పరిగణలోకి తీసుకుని నిలిపివేశామని చెప్పింది. ఈ క్రమంలోనే స్పందించిన సీజే ధర్మాసనం.. ప్రజల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుంటే పూర్తిగా ఎందుకు రద్దు చేయలేదని ప్రశ్నించింది. హైకోర్టు అనుమతి లేకుండా మాస్టర్ ప్లాన్‌పై ముందుకు వెళ్లవద్దని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

కామారెడ్డి మాస్టర్ ప్లాన్ అంశానికి సంబంధించి సింగిల్ బెంచ్‌లో ఉన్న మరో పిటిషన్‌ను డివిజన్ బెంచ్‌లో ఇంప్లీడ్ చేసింది. తదుపరి విచారణను ఏప్రిల్ 17కు వాయిదా వేసింది. 

ఇక, ఇందుకు సంబంధించి గత విచారణలో కేఏ పాల్ వాదనలు వినిపిస్తూ.. మాస్టర్ ప్లాన్ కారణంగా ఒక యువ రైతు ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పారు. ఒక ఎకరం లేదా అంతకంటే తక్కువ ఉన్న దాదాపు 2,000 మంది సన్నకారు రైతులు జీవనోపాధి లేక ఇబ్బందులు పడుతున్నారని.. వారి అభిప్రాయాలు తీసుకోకుండా ప్రభుత్వం ఏకపక్షంగా మాస్టర్ ప్లాన్ నోటిఫికేషన్‌ జారీ చేసిందని ఆరోపించారు. ముసాయిదా మాస్టర్‌ప్లాన్‌కు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతులపై పోలీసులు లాఠీచార్జి చేశారని ఆరోపించారు. ప్రభుత్వ అధికారులు, జిల్లా కలెక్టర్ నియంతలుగా వ్యవహరిస్తున్నారని పాల్ కోర్టుకు తెలిపారు.

మరోవైపు ప్రతిపాదిత మాస్టర్‌ప్లాన్‌ను ఉపసంహరించుకోవాలని పురపాలక సంఘం ఏకగ్రీవంగా తీర్మానం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి తీర్మానాన్ని సమర్పించిందని కామారెడ్డి మున్సిపాలిటీ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. అయితే ఆ వాదనలపై కేఏ పాల్ స్పందిస్తూ.. డ్రాఫ్ట్ మాస్టర్ ప్లాన్‌ను ఉపసంహరించుకోవడానికి లేదా రద్దు చేయడానికి మున్సిపాలిటీకి ఎటువంటి అధికారాలు లేవని వాదించారు. ఇది రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అని చెప్పారు. ఈ క్రమంలోనే కామారెడ్డి మాస్టర్‌ ప్లాన్‌పై రాష్ట్ర ప్రభుత్వం తమ వైఖరిపై వివరణ ఇవ్వాలని ఆదేశించిన హైకోర్టు.. విచారణను ఫిబ్రవరి 13కు వాయిదా వేసింది. ఈ క్రమంలోనే నేడు హైకోర్టులో విచారణ జరిగింది.


ఇదిలా ఉంటే.. కామారెడ్డి మాస్టర్‌ ప్లాన్‌కు వ్యతిరేకంగా ఆ ప్రాంత రైతులు పెద్ద ఎత్తున ఉద్యమించిన సంగతి తెలిసిందే. రైతుల ఆందోళనలను ప్రతిపక్షాలు కూడా మద్దతుగా నిలిచాయి. మాస్టర్ ప్లాన్‌కు వ్యతిరేకంగా పలువురు రైతులు కోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలోనే మున్సిపల్‌ కార్యవర్గం అత్యవసర సమావేశం నిర్వహించి.. ముసాయిదాను రద్దు చేసింది. మాస్టర్ ప్లాన్ రద్దు తీర్మానాన్ని కౌన్సిలర్లంతా ఆమోదించారు. డిజైన్ డెవలప్‌మెంట్ ఫోరం రూపొందించిన మాస్టర్ ప్లాన్‌ను ఉపసంహరించుకోవాలని కౌన్సిల్ అత్యవసర సమావేశంలో నిర్ణయించినట్లు కామారెడ్డి మున్సిపల్ కౌన్సిల్ చైర్‌పర్సన్ జాహ్నవి తెలిపారు. రైతుల భూముల్లో పారిశ్రామిక జోన్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబోమని జాహ్నవి స్పష్టం చేశారు.