మాజీ మంత్రి ఈటల రాజేందర్‌కు చెందిన జమునా హ్యాచరీస్‌ భూముల్లో సర్వే నిలిపివేతకు తెలంగాణ హైకోర్టు నిరాకరించింది. సర్వే నోటీసులపై స్టే ఇచ్చేందుకు నో చెప్పింది న్యాయస్థానం. కరోనా కారణంగా సర్వేను కొన్ని రోజులు వాయిదా వేసేందుకు సిద్ధమని కోర్టుకు తెలిపారు ఏజీ. జూన్ 2 లేదా మూడో వారంలో సర్వే చేయాలని తహసీల్దార్‌ను ఆదేశించింది హైకోర్టు. 

కాగా, మెదక్ జిల్లాలో 2018 లో జమున హేచరీస్, 2019 లో జమున హేచరీస్ ఎన్ ఓసీ తీసుకొన్న సర్వే నెంబర్లకు తేడా ఉందని ఈ నెల 17న  రెవిన్యూ అధికారులు ప్రకటించారు. మెదక్ జిల్లాలోని హకీంపేట, మాసాయిపేట గ్రామాల పరిధిలో జమున హేచరీస్  సంస్థ ఆక్రమించుకొన్నట్టుగా చెబుతున్న భూముల్లో మాసాయిపేట, వెల్ధర్తి తహసీల్దార్లు 17వ తేదీ నాడు విచారణ నిర్వహించారు. పంచాయితీ సెక్రటరీని బెదిరించి ఎన్ ఓ సీ తీసుకొన్నారని విచారణలో తేలిందని రెవిన్యూ అధికారులు తెలిపారు. 

Also Read:ఈటల బీజేపీలోకి వస్తే , ఢిల్లీ పెద్దలకు... రాష్ట్ర నేతలకు బండి సంజయ్ వివరణ

హకీంపేటలో 111 సర్వే నెంబర్ లో అనధికార నిర్మాణం జరుగుతుంటే  గ్రామ కార్యదర్శి రెండు సార్లు నోటీసులు ఇచ్చారని చెప్పారు. 130 సర్వే నెంబర్ లో 18.35 ఎకరాలు ఉంటే అందులో 3 ఎకరాలు పట్లా, 15.35 ఎకరాలు సీలింగ్ భూమిగా తమ విచారణలో తేలిందని తహసీల్దార్లు ప్రకటించారు. 2018లో 55, 124, 126,128, 129 సర్వే నెంబర్లకు ఎన్ ఓ సీ తీసుకొన్నట్టుగా జమున హేచరీస్ సంస్థ ప్రతినిధులు  చెబుతున్నారన్నారు.

కానీ 2019లోనే పాత సర్వే నెంబర్లకు సర్వే నెంబర్ 130 ని చేర్చి ఎన్ ఓ సీ తీసుకొన్నారని రెవిన్యూ అధికారులు సోమవారం నాడు మీడియాకు చెప్పారు. 95.22 ఎకరాల అసైన్డ్ భూములకు సంబంధించి 75 మంది నోటీసులు ఇచ్చామని రెవిన్యూ అధికారులు ప్రకటించారు.  ఈ నెల 26,27,28 తేదీల్లో భూముల సర్వే  నిర్వహస్తామన్నారు.ఈ నెల 25న రైతుల విచారణ నిర్వహిస్తామన్నారు. రెండు గ్రామ పంచాయితీల సెక్రటరీల స్టేట్ మెంట్ తీసుకొన్నట్టుగా రెవిన్యూ అధికారులు తెలిపారు.