Asianet News TeluguAsianet News Telugu

బండి సంజయ్ పాదయాత్రకు హైకోర్టు అనుమతి.. షరతులు పాటించాల్సిందే..

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్రకు హైకోర్టు అనుమతించింది. సంజయ్ పాదయాత్రకు షరుతులతో కూడిన అనుమతిస్తూ తీర్పు వెలువరించింది.

Telangana High Court On Bandi Sanjay padayatra Petition
Author
First Published Nov 28, 2022, 12:55 PM IST

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్రకు హైకోర్టు అనుమతించింది. సంజయ్ పాదయాత్రకు షరుతులతో కూడిన అనుమతిస్తూ ఉత్తర్వులు వెలువరించింది. బండి సంజయ్ పాదయాత్రకు పోలీసులు అనుమతి నిరాకరించడాన్ని సవాలు చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ క్రమంలోనే బండి సంజయ్ పాదయాత్రకు షరతులతో కూడిన అనుమతిని ఇచ్చింది. భైంసా సిటీలోకి వెళ్లకుండా పాదయాత్ర వెళ్లకుండా నిర్వహించాలని ఆదేశించింది. అలాగే భైంసా పట్టణానికి మూడు కిలో మీటర్ల దూరంలో సభ నిర్వహించేందుకు అనుమతించింది.

నేతలు, కార్యకర్తలు, ఇతర మతాలను రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేయవద్దని హైకోర్టు స్పష్టం చేసింది. 500 మందితో మాత్రమే పాదయాత్ర చేయాలని హైకోర్టు ఆదేశించింది. 3 వేల మందితో సభ జరుపుకోవాలని తెలిపింది. మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే సభను నిర్వహించాలని ఆదేశించింది. కార్యకర్తలు కర్రలు, ఆయుధాలు వాడొద్దని తెలిపింది. 

ఈ విచారణ సందర్భంగా బీజేపీ తరపున రామచందర్ రావు వాదనలు వినిపించారు. బైంసా లోపలి నుంచి పాదయాత్ర వెళ్ళదని కోర్టుకు తెలిపారు. భైంసా వై-జంక్షన్ నుంచి పాదయాత్ర వెళ్తుందన్నారు. అయితే బైంసా పట్టణంలోకి పాదయాత్ర ప్రవేశించనప్పుడు ఎందుకు అనుమతి ఇవ్వడం లేదని హైకోర్టు ప్రశ్నించింది. బైంసా చాలా సున్నితమైన ప్రాంతమని ప్రభుత్వం తరపున న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉందన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం బండి సంజయ్ పాదయాత్రకు హైకోర్టు షరతులతో అనుమతినిచ్చింది.

ఇక, బండి సంజయ్ చేపట్టాల్సి ఉన్న ఐదో విడత ప్రజాసంగ్రామ యాత్రకు పోలీసులు అనుమతి నిరాకరించిన సంగతి  తెలిసిందే. ఈ క్రమంలోనే బీజేపీ హైకోర్టును ఆశ్రయించింది. నిర్మల్ పోలీసులు కావాలనే పాదయాత్రకు అనుమతి నిరాకరించారని పిటిషన్‌లో పేర్కొంది. వారం రోజుల క్రితం అనుమతి ఇచ్చి.. ఇప్పుడు కావాలనే రద్దు చేసినట్టుగా ఆరోపించింది.

ఇక, షెడ్యూల్ ప్రకారం బండి సంజయ్ ఐదో విడత ప్రజాసంగ్రామ యాత్ర నేడు భైంసాలో ప్రారంభం కావాల్సి ఉంది. అక్కడ బహిరంగ సభ నిర్వహించేందుకు కూడా బీజేపీ ప్లాన్ చేసింది. ఈ సభకు మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కూడా హాజరుకావాల్సి ఉంది. అయితే పాదయాత్రను ప్రారంభించేందుకు నిర్మల్‌కు వెళుతుండగా ఆదివారం సాయంత్రం జగిత్యాల జిల్లా వెంకటాపూర్ పోలీసులు బండి సంజయ్‌ను అడ్డుకున్నారు. పాదయాత్రకు, సభకు అనుమతి నిరాకరించిన నేపథ్యంలో పోలీసులు ఆయనను అడ్డుకున్నట్టుగా చెప్పారు.  ఈ క్రమంలోనే పోలీసులకు, బండి సంజయ్‌కు మధ్య తీవ్ర వాగ్వాదం కొనసాగింది. పోలీసులు ఉద్దేశ్యపూర్వకంగా బండి సంజయ్ పాదయాత్రకు అడ్డంకులు కల్పిస్తున్నారని బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఆరోపించారు. అనంతరం బండి సంజయ్‌ను కరీంనగర్‌లోని ఆయన నివాసానికి తరలించారు. 

భైంసా మతపరమైన సున్నితమైన పట్టణం కావడంతో బండి సంజయ్ పాదయాత్రకు, బహిరంగ సభకు అనుమతి నిరాకరించినట్టుగా పోలీసులు తెలిపారు. భైంసా సున్నిత ప్రాంతమని, శాంతి భద్రతల దృష్ట్యా బీజేపీ చేపట్టిన పాదయాత్ర, బహిరంగ సభకు పోలీసు శాఖ నుంచి ఎలాంటి అనుమతి లేదని నిర్మల్ జిల్లా ఎస్పీ ప్రవీణ్ కుమార్ తెలిపారు. జిల్లాలో 30 పోలీసు యాక్ట్ అమల్లో ఉందని చెప్పారు. 

ఇక, బండి సంజయ్ ఐదో విడత ప్రజా సంగ్రామ యాత్ర షెడ్యూల్ ప్రకారం.. ఐదు జిల్లాల్లోని మూడు లోక్‌సభ, ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల్లో 20 రోజుల పాటు 220 కిలోమీటర్ల మేర యాత్ర సాగాల్సి ఉంది. డిసెంబర్ 17న కరీంనగర్‌లో పాదయాత్ర ముగిసేలా షెడ్యూల్‌ను రూపొందించారు. పాదయాత్ర ముగింపు సందర్భంగా కరీంనగర్ పట్టణంలోని ఎస్‌ఆర్‌ఆర్ కళాశాలలో బహిరంగ సభ నిర్వహించాలని భావించారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios