హైదరాబాద్: జాతీయ జెండాను ఆవిష్కరించకుండా గోడకు అతికించి అవమానపర్చారని యాదగిరిగుట్ట ఈవోపై దాఖలపై పిటిషన్  విచారణ సందర్భంగా తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.

ఆగష్టు 15వ తేదీన  జాతీయ పతాకాన్ని ఆవిష్కరించకుండా గోడకు అతికించారని పిటిషనర్ చెప్పారు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించకుండా గోడకు అంటించి అవమానపర్చారని పిటిషనర్ వాదించారు. 

జాతీయ జెండా కార్యాలయం లోపల గోడకు అతికించవద్దని చట్టంలో ఎక్కడ ఉందని హైకోర్టు ప్రశ్నించింది. జాతీయ జెండాను బయటే ఎగురవేయాలని చట్టంలో ఉందా అని హైకోర్టు ప్రశ్నించింది.  జాతీయ జెండాను కార్యాలయ ఆవరణలోని గోడకు అతికిస్తే జాతీయతను ప్రదర్శించినట్టే కదా అని హైకోర్టు అభిప్రాయపడింది.

ప్రస్తుత పరిస్థితుల్లో జాతీయ ఆరోగ్యం ముఖ్యమని హైకోర్టు వ్యాఖ్యానించింది.  జాతీయ జెండాను యాదాద్రి ఈవో అవమానించారని దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని హైకోర్టు కొట్టేసింది.

స్వాతంత్ర్య దినోత్సవం, రిపబ్లిక్ డే తో పాటు ఇతర ముఖ్యమైన రోజుల్లో ప్రభుత్వ కార్యాలయాల్లో  జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు. అయితే స్వాతంత్ర్య దినోత్సవం రోజున ఈవో జాతీయ జెండాను ఆవిష్కరించలేదని పిటిషనర్ ఆరోపించారు.