టీఎస్‌పీఎస్‌సీ  పేపర్ లీక్  కేసు దర్యాప్తును  సీబీఐకి అప్పగించాలని  ఎన్ఎస్‌యూఐ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణను జూన్  5వ తేదీకి  వాయిదా వేసింది తెలంగాణ హైకోర్టు. 

హైదరాబాద్: టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీక్ కేసు దర్యాప్తును సీబీఐతో దర్యాప్తు చేయించాలని ఎన్ఎస్‌యూఐ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణను ఈ ఏడాది జూన్ 5వ తేదీకి వాయిదా వేసింది తెలంగాణ హైకోర్టు. టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీక్ కేసు దర్యాప్తును ఈ ఏడాది జూన్ 5 లోపుగా స్టేటస్ రిపోర్టును సమర్పించాలని కోర్టు ఆదేశించింది. మరోవైపు ప్రస్తుత దశలో ఈ కేసు విచారణను సీబీఐకి అప్పగించే విషయమై ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేమని హైకోర్టు తెలిపింది.

పేపర్ లీక్ కేసులో ఎంతమంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు పరీక్షలు రాశారు. ఎంత మంది ఉద్యోగులు అనుమతి తీసుకుని పరీక్ష రాశారు. పరీక్ష రాసిన ఉద్యోగులను ఎంత మందిని విచారించారని సిట్ ను హైకోర్టు ప్రశ్నించింది. అయితే ఈ కేసులో ఏ 1 నిందితుడు అనుమతి తీసుకున్నట్టుగా సిట్ బృంద సభ్యుడు హైకోర్టుకు తెలిపారు. అయితే ఈ కేసు దర్యాప్తు ఆలస్యమైందని హైకోర్టు అభిప్రాయపడింది.

ఈ కేసు అత్యంత సెన్సిటివ్ అని హైకోర్టు చెబుతూనే ఈ సమయంలో ఆదేశాలు జారీ చేస్తే ఇప్పటివరకు నిర్వహించిన దర్యాప్తునకు సంబంధించిన విషయాలు బయటకు వస్తే ఇబ్బంది అవుతాయని హైకోర్టు అభిప్రాయపడింది.. మరో వైపు జూన్ 5న దర్యాప్తునకు సంబంధించి స్టేటస్ రిపోర్టు సమర్పించాలని ఆదేశించింది. అదే రోజున ఈ పిటిషన్ పై విచారణ జరుపుతామని హైకోర్టు విచారణను వాయిదా వేసింది.

టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీక్ కేసును సీబీఐతో దర్యాప్తు చేయించాలని కోరుతూ ఈ ఏడాది మార్చి 17న ఎన్ఎస్‌యూఐ అధ్యక్షుడు బల్మూరి వెంకట్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై ఇవాళ హైకోర్టు విచారించింది. 

ఈ ఏడాది మార్చి 12, 15,16 తేదీల్లో జరగాల్సిన టౌన్ ఫ్లానింగ్ ఓవర్సీస్, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ల నియామాకాల పరీక్షలకు సంబంధించి పరీక్షలను తొలుత టీఎస్‌పీఎస్‌సీ వాయిదా వేసింది. టీఎస్‌పీఎస్‌సీ కంప్యూటర్లు హ్యాక్ అయ్యారని తొలుత భావించారు. కానీ టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీకైందని పోలీసులు గుర్తించారు.