Telangana rains: భారీ వర్షాలు.. తెలంగాణలో మళ్లీ ఆన్ లైన్ క్లాసులు షురూ..
Hyderabad: తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలతో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. చాలా ప్రాంతాలు జలమయమయ్యాయి. రోజువారి పనులు చేసుకోవడంలో జనాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరో రెండు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అంచనాల మధ్య ప్రభుత్వం అప్రమత్తమైంది.
Telangana rains: తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలతో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. చాలా ప్రాంతాలు జలమయమయ్యాయి. రోజువారి పనులు చేసుకోవడంలో జనాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరో రెండు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అంచనాల మధ్య ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలి సూచిస్తూ మందస్తు చర్యలు తీసుకుంటోది. ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వం బుధ, గురువారాల్లో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించడంతో ప్రయివేటు పాఠశాలలు విద్యార్థులకు నిరంతరాయంగా పాఠాలు చెప్పేందుకు ఆన్ లైన్ తరగతులు నిర్వహిస్తున్నాయి.
వివరాల్లోకెళ్తే.. కరోనా మహమ్మారి సమయంలో రాష్ట్రంలోని స్కూళ్లు, కాలేజీలు సహా అన్ని విద్యాసంస్థలు ఆన్ లైన్ క్లాసులు నిర్వహించాయి. ఆన్ లైన్ క్లాసులకు సంబంధించిన మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసుకున్నాయి. అయితే, ప్రస్తుతం రాష్ట్రంలో వర్షాలు దంచికొడుతుండటంతో ప్రభుత్వం స్కూళ్లకు సెలవులు ప్రకటించింది. దీంతో ప్రయివేటు విద్యా సంస్థలు మళ్లీ ఆన్ లైన్ క్లాసులు నిర్వహిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం బుధ, గురువారాల్లో అన్ని విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించడంతో విద్యార్థులు చదువుకు దూరం కాకుండా పలు ప్రయివేటు పాఠశాలలు ఆన్ లైన్ తరగతులు ప్రారంభించాయి. కుండపోత వర్షాల దృష్ట్యా ఈ నెలలో విద్యాసంస్థలకు ఐదు రోజుల పాటు సెలవులు ఉండడంతో రాష్ట్ర బోర్డుకు అనుబంధంగా ఉన్న పాఠశాలలు నష్టాన్ని పూడ్చుకుని జూలై 31లోగా పూర్తి చేయాల్సిన మొదటి ఫార్మేటివ్ మూల్యాంకనం కోసం ఆన్ లైన్ లో సిలబస్ ను పూర్తి చేస్తున్నాయి. గ్రేడ్ ను బట్టి పాఠశాలలు గంట నుంచి మధ్యాహ్నం వరకు తరగతులు నిర్వహిస్తున్నాయి.
హైదరాబాద్ నగరంలోని లోని ఓ ప్రయివేటు పాఠశాలలో చదువుతున్న ఓ చిన్నారి తల్లిదండ్రులు పాఠశాలకు వెంటనే సెలవులు ప్రకటించినప్పటికీ యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ తో కూడిన ఆన్ లైన్ క్లాసులను ప్రారంభించారని తెలిపారు. కేవలం క్లాసులే కాకుండా పేరెంట్-టీచర్ మీటింగ్ ను కూడా కొన్ని పాఠశాలలు ఆన్ లైన్ లో నిర్వహించాయి. శుక్రవారం వ్యక్తిగత పేరెంట్-టీచర్ మీటింగ్ జరగాల్సి ఉన్నప్పటికీ, గురువారం ఆన్ లైన్ సమావేశం జరుగుతుందని పాఠశాల యాజమాన్యం సందేశం పంపింది. తెలంగాణ ప్రభుత్వం బుధ, గురువారాల్లో సెలవులు ప్రకటించినప్పటికీ ప్రైవేటు పాఠశాలలు తమను పాఠశాలకు రిపోర్టు చేయమని కోరడంపై పలువురు ఉపాధ్యాయులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆన్లైన్ క్లాసులు, శిక్షణ, మూల్యాంకన పనులను ఉదహరిస్తూ పాఠశాలల యాజమాన్యాలు భారీ వర్షంలో కూడా ఉపాధ్యాయులు రిపోర్టు చేయాలని కోరాయి. దీనిపై సంబంధిత జిల్లా విద్యాశాఖాధికారులకు ఫిర్యాదు చేశామని తెలంగాణ ప్రైవేట్ స్కూల్స్ టీచర్స్ ఫోరం అధ్యక్షుడు షేక్ షబ్బీర్ అలీ తెలిపారు.
మరోవైపు రెండో శనివారం కూడా తరగతులు నిర్వహించేందుకు ప్రైవేటు పాఠశాలలు సిద్ధమవుతున్నాయి. ఈ నష్టాన్ని పూడ్చుకునేందుకు, సకాలంలో సిలబస్ పూర్తి చేసేందుకు విద్యాసంవత్సరం పూర్తయ్యే వరకు రెండో శనివారం తరగతులు నిర్వహిస్తామన్నారు. పండుగలకు స్వల్ప సెలవులను కుదించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామని తెలంగాణ గుర్తింపు పొందిన పాఠశాలల యాజమాన్యాల సంఘం అధ్యక్షుడు వై.శేఖర్ రావు తెలిపారు.