ప్రపంచంలో కరోనా వైరస్ కంటే భయంకరమైన వ్యాధులు వచ్చాయన్నారు తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్. శుక్రవారం మీడియాతో మాట్లాడిన ఆయన ..  వ్యాధులు పంజా విసిరినప్పుడు ఆనాటి ప్రజలు ఇంతలా భయపడలేదని గుర్తుచేశారు.

కరోనా వైరస్‌కు మనుషుల్ని చంపే శక్తి లేదని, సత్వరమే గుర్తించి చికిత్స చేయించుకోవాలని ఆయన సూచించారు. చికిత్సకు సంబంధించి దేశం నలుమూలల నుంచి ఏ మంచి కార్యక్రమం జరిగినా దానిని అనుసరించామని చెప్పారు.

Also Read:హైదరాబాదులో మళ్లీ కరోనా ఉధృతి: తెలంగాణలో లక్షా 17 వేలపైనే కేసులు

అందులో భాగమే బస్తీ దవాఖానా అన్నారు. వీటిల్లో మందుకు కొదవ లేదని తెలిపారు. యూపీహెచ్‌సీ, బస్తీ దవాఖానాలో కరోనా టెస్టులు చేస్తున్నామని, వారం రోజుల నుంచి రాష్ట్రంలో రోజుకు 50-60 వేల టెస్టులు చేస్తున్నట్లు రాజేందర్ వెల్లడించారు.

ప్రస్తుతం కోవిడ్‌‌తో దేశంలో చనిపోతున్న వారితో పోల్చితే.. తెలంగాణలో చనిపోతున్న వారి సంఖ్య చాలా తక్కువని ఆయన వెల్లడించారు. కోవిడ్ పాజిటివ్ వచ్చిన వ్యక్తులకు ఐసోలేషన్ కిట్లు ఇస్తున్నామని మంత్రి స్పష్టం చేశారు.

హైదరాబాద్ రిసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్‌కు ప్రభుత్వ మద్దతు ఉంటుందని వెల్లడించారు. వైరస్ సోకిన వారిలో 80 శాతం మందికి మందులతో నయమవుతుందని..  4 శాతం మందికి మాత్రమే ఆక్సిజన్ అవసరం ఉంటుందని రాజేందర్ స్పష్టం చేశారు. ప్రజల్లో కోవిడ్ పట్ల అవగాహన పెరిగిందన్న మంత్రి... రాబోయే రోజుల్లో కరోనాతోనే జీవించాలని సూచించారు.