కరోనా రోగుల కోసం టిమ్స్ ఆసుపత్రి పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చిందన్నారు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ . ఆదివారం ఆసుపత్రిని సందర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ... టిమ్స్‌లో 1,350 బెడ్ల సౌకర్యం వుందని, ఇంటెన్సివ్ కేర్ యూనిట్లు, వెంటిలేటర్లతో కూడిన సదుపాయాలు ఉన్నాయన్నారు.

లక్షణాలు కనిపించగానే ఆసుపత్రిలో చేరాలని, కొందరు నాలుగైదు రోజుల ఆలస్యం చేస్తున్నారని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. దీనివల్ల వైరస్ తీవ్రత అధికమవుతోందని, వారిని రక్షించడం కష్టమవుతోందని రాజేందర్ ఆవేదన వ్యక్తం చేశారు.

కరోనా చికిత్స ఖరీదైనది కాదని, ఆక్సిజన్ మందులన్నీ కలిపితే రూ.పదివేలకు మించి కాదని మంత్రి స్పష్టం చేశారు. రోజుకు లక్ష, రెండు లక్షలు ఖర్చయ్యే చికిత్స అసలు కాదన్నారు.

Also Read:తెలంగాణలో తగ్గని కరోనా ఉధృతి: నిన్నొక్కరోజే 1891 కేసుల నమోదు

రోగుల వద్ద అధిక ఫీజులు వసూలు  చేస్తే కఠిన చర్యలు తప్పవని ఈటల ప్రైవేట్ ఆసుపత్రులను హెచ్చరించారు. హైదరాబాద్‌లోని చెస్ట్, ఫీవర్, కింగ్ కోఠీ ఆసుపత్రుల్లో కావాల్సినన్ని బెడ్లు అందుబాటులో ఉన్నాయని ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు.

రాష్ట్రంలో పలు ఆసుపత్రుల్లో లిక్విడ్ ఆక్సిజన్ ట్యాంకులను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని.. ఇది ఏర్పాటైతే ఆక్సిజన్ సిలిండర్లు దొరికినా దొరక్కపోయినా ఇబ్బంది ఉండదని ఈటల రాజేందర్ వెల్లడించారు.