తెలంగాణాలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. గత 24 గంటల్లో తెలంగాణలో 1891 కేసులు నమోదయ్యాయి. దీనితో మొత్తం కేసుల సంఖ్య 66,677 కు చేరుకుంది. నిన్నొక్కరోజే 1088 మంది కోలుకోగా, ఇప్పటివరకు కోలుకున్న వారి సంఖ్య 47,590 కి చేరింది. 

ప్రస్తుతం తెలంగాణలో 18,547 యాక్టీవ్ కేసులున్నాయి. హోమ్ ఐసొలేషన్ లో 12,001 మంది ఉన్నారు. కరోనా ధాటికి నిన్నొక్కరోజు 10 మంది మరణించారు. దీనితో ఇప్పటివరకు మరణించిన సంఖ్య 540 కి చేరింది. 

తెలంగాణలో రికవరీ రేటు కూడా జాతీయ రికవరీ రేటు కన్నా అధికంగా ఉంది. దేశంలో 64.53 శాతంగా రికవరీ రేటు ఉంటె... తెలంగాణలో అది 71.3 శాతంగా ఉంది. నిన్నొకరోజే రోజు 19 వేల పై చిలుకు టెస్టులను చేసారు. ఇప్పటివరకు తెలంగాణలో మొత్తంగా 477795 టెస్టులను నిర్వహించారు. 

హైదరాబాద్, దాని పరిసరాల్లో కేసులు పెరుగుతూనే ఉండగా... వరంగల్ అర్బన్ పరిధిలో మూడంకెల సంఖ్యలో కేసులు నమోదవుతుండటం కలవర పెడుతున్న అంశం. 

ఇకపోతే... . ఆదిలాబాద్ రిమ్స్ లో చికిత్స పొందుతున్న 10మంది కరోనా రోగులు హాస్పిటల్ నుండి తమ ఇళ్లకు చేరుకున్నారు. అయితే వారు కరోనా నుండి కోలుకుని డిశ్చార్జయి ఇంటికి చేరలేదు... ఇంకా కరోనాతో బాధపడుతూనే హాస్పిటల్ నుండి తప్పించుకుని ఇంటికి చేరుకున్నారు. దీంతో పట్టణంలో కలకలం రేగింది. 

ఇలా హాస్పిటల్ నుండి ఇంటికి చేరుకునే క్రమంలో వారు ఎవరెవరిని కలిశారో తెలీదు. ఎక్కడెక్కడ సంచరించారో తెలీదు. అసలు ఇలా పారిపోయిన వారిలో కొందరి ఆచూకీ ఇప్పటికీ లభ్యం కాలేదు. వారు జనాలతో కలిసి తిరిగితే మాత్రం వీరిద్వారా మరింత మంది కరోనాబారిన పడే అవకాశాలుంటాయి. దీంతో ఆదిలాబాద్ ప్రజల్లో భయాందోళన మొదలయ్యింది. 

read more   మనవళ్లకు కరోనా సోకుతుందేమోనని... తాత నాన్నమ్మ ఆత్మహత్య

రిమ్స్ నుండి పారిపోయిన కరోనా పేషెంట్స్ లో ఆదిలాబాద్ పట్టణానికి చెందిన వారు ఇద్దరుండగా, ఇంద్రవెల్లికి చెందినవారు మరో ఇద్దరు వున్నట్లు ఇప్పటివరకు గుర్తించారు. వారిని ఇప్పటికే ఫోన్ ద్వారా అధికారులు సంప్రదించినట్లు  తెలస్తోంది. ఇక మిగతా ఆరుగురు ఆచూకీ మాత్రం లభించలేదు. అధికారులు వారి ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు.