నవంబర్ 25 నుంచి డిసెంబర్ 23 మధ్యకాలంలో అంతర్జాతీయ ప్రయాణాలు చేసిన వారిని ట్రేస్ చేసే పనిలో వున్నట్లు తెలిపారు తెలంగాణ హెల్త్ డైరెక్టర్. దేశంలోకి బ్రిటన్ వైరస్ వచ్చినట్లుగా వార్తలు వస్తుండటంతో తెలంగాణ వైద్య శాఖ అప్రమత్తమైంది.

ఈ క్రమంలో మంగళవారం హెల్త్ డైరెక్టర్ మీడియాతో మాట్లాడారు. రాబోయే 14 రోజులు విదేశాల నుంచి వచ్చే వారిని ట్రాక్ చేసేందుకు గాను హెల్త్ డైరెక్టర్ కార్యాలయంలో 040-24651119 నెంబర్‌ను ఏర్పాటు చేశామన్నారు.

గత కొన్ని రోజులుగా యూకే నుంచి ఎవరైనా హైదరాబాద్‌కు వస్తే.. వారు ఆ నెంబర్‌కు ఫోన్ చేసి చెప్పాలని ఆయన విజ్ఞప్తి చేశారు. జిల్లాల్లో వున్న వారి దగ్గరకు ప్రభుత్వ హెల్త్ వర్కర్లు వస్తారని.. అవసరమైన వారికి ఆర్‌టీపీసీఆర్ టెస్టులు చేస్తామని తెలంగాణ హెల్త్ డైరెక్టర్ తెలిపారు.

నిన్న రాత్రి హైదరాబాద్‌కు వచ్చిన ఏడుగురికి కోవిడ్ 19 టెస్ట్ చేశామని, వారికి పరీక్షల్లో నెగిటివ్ వచ్చిందన్నారు. అలాగే గత వారం రోజులుగా తెలంగాణకు వచ్చిన వారిని గుర్తించి, వారికి ఆర్‌టీపీసీఆర్ టెస్ట్ చేస్తామన్నారు.

కొత్త రకం వైరస్ గురించి ప్రజలు ఆందోళన చెందాల్సిన పనిలేదని.. సార్స్ కోవ్ 2లో కూడా కొన్ని వందల మ్యూటేషన్లు జరుగుతున్నాయని చెప్పారు. అయితే బ్రిటన్‌లో వెలుగు చూసిన వైరస్ మిగిలిన వాటి కంటే చాలా వేగంగా వ్యాపిస్తుందని ఆయన పేర్కొన్నారు.

కొత్త వైరస్ నేపథ్యంలో అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయన్నారు. తెలంగాణ నుంచి ఎవరూ ఇంకా పాజిటివ్‌గా తేలలేదన్నారు. యూకే నుంచి తెలంగాణకు ఇప్పటి వరకు 355 మంది వచ్చినట్లు చెప్పారు.

రాష్ట్రంలో ప్రస్తుతం పరిస్ధితి అదుపులోనే వుందని హెల్త్ డైరెక్టర్ తెలిపారు. ఇప్పటి వరకు తెలంగాణలో 65,20,993 పరీక్షలు నిర్వహించామని.. దానిలో ఈరోజు వరకు పాజిటివ్ రేట్ 1.19 శాతంగా వుందన్నారు. ప్రతిరోజూ 400 నుంచి 500 కేసులు నమోదవుతున్నాయని ఆయన వెల్లడించారు.