యూకే నుంచి వచ్చిన వారికి కోవిడ్ నిర్థారణ కాలేదన్నారు తెలంగాణ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాస్. డిసెంబర్ 9 నుంచి ఈ రోజు వరకు రాష్ట్రానికి 1200 మంది వచ్చినట్లు తాము గుర్తించినట్లు ఆయన తెలిపారు.

ఇంకా కొంతమందికి కోవిడ్ టెస్టులు చేస్తున్నామన్నారు. బ్రిటన్ నుంచి వచ్చిన వారి వివరాలు సేకరించి, వారి ఆరోగ్య పరిస్థితిని పరిశీలిస్తున్నామని వారందరికీ వైద్య పరీక్షలు చేస్తున్నామని వెల్లడించారు. వారి ఆరోగ్య పరిస్థితిని ఆరా తీస్తున్నామని శ్రీనివాస్ చెప్పారు. ఇప్పటి వరకు చేసిన పరీక్షల్లో ఎవరికీ కోవిడ్ నిర్థారణ కాలేదని ఆయన స్పష్టం చేశారు.

డిసెంబర్ 9 తరువాత బ్రిటన్ నుంచి రాష్ట్రానికి నేరుగా వచ్చిన వారు లేదా బ్రిటన్ గుండా ప్రయాణించి వచ్చిన వారు దయచేసి వారి వివరాలను 040-24651119 నంబర్ కి ఫోన్ చేసి లేదా 9154170960 నంబర్‌కి వాట్సప్ ద్వారా అందించాలని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ విజ్ఞప్తి చేసింది.

మరోవైపు తెలంగాణలో కరోనా వైరస్ రెండో దశ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. ప్రజలు ధైర్యంగా, అప్రమత్తంగా ఉండాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ విజ్ఞప్తి చేశారు.