ఏపీ సర్కారుకు లేఖ రాసిన తెలంగాణ సీఎస్

రాష్ట్రం విడిపోయినా ఏపీ, తెలంగాణకు 10 ఏళ్ల వరకు హైదరాబాదే ఉమ్మడి రాజధానిగా ఉండాలని కేంద్రం నిర్ణయించిన విషయం తెలిసిందే.

ఈ విషయంపై అప్పట్లో ఏపీ, తెలంగాణ భిన్న వాదనలు వినిపించినా ఇప్పుడు అంతా సద్దుమణిగింది. రాష్ట్రం విడిపోయి మూడేళ్లుకావొస్తున్నా విభజన సమస్యలు మాత్రం ఇంకా కొలిక్కి రావడం లేదు.

ఉద్యోగుల విభజన పై ఇంకా పీఠముడి అలాగే కొనసాగుతోంది. హై కోర్టు విభజన ఇంకా పట్టాలెక్కనే లేదు. ఇక 10 ఏళ్లు హైదరాబాద్ లో ఏం ఉంటామని ఏపీ సీఎం చంద్రబాబు అప్పుడే అమరావతి నుంచి పాలన మొదలుపెట్టాడు.

ఇప్పటికే తాత్కాలిక సచివాలయం అమరావతిలో కొలువుదీరింది. అసెంబ్లీ సమావేశాలు కూడా అమరావతి నుంచే కొనసాగుతున్నాయి. హైదారబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఏపీ ఉద్యోగులను కొన్నాళ్ల కిందటే అమరావతికి పంపించేశారు.

అయితే పునర్విభజన చట్టం ప్రకారం 10 ఏళ్ల వరకు హైదరాబాద్ లో కొన్ని భవనాలు ఏపీ ప్రభుత్వం ఉపయోగించుకోవచ్చు. ముఖ్యంగా విభజన చట్టం ప్రకారం సచివాలయంలో ఏపీకి వచ్చిన భవనాలను 10 ఏళ్లు వాడుకోవాలి. వాటికి సంబంధించి విద్యుత్, నీటి సరఫరాను తెలంగాణ ప్రభుత్వం అందిస్తుంది. దీనికి ఏపీ ప్రభుత్వం బిల్లులు చెల్లించాలి.

అయితే గత కొన్నాళ్లుగా సచివాలయం భవనాలకు సంబంధించిన కరెంటు, నీటి బిల్లులను ఏపీ ప్రభుత్వం చెల్లించడం లేదట.

ఈ అంశాన్ని కాస్త సీరియస్ గానే తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం వెంటనే ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కి ఈ విషయమై లేఖ రాసిందట. మరి ఏపీ ప్రభుత్వం దీనిపై ఎలా స్పందిస్తుందో చూడాలి.