మూడేళ్లలో శంషాబాద్ విమానాశ్రయానికి మెట్రో.. డిసెంబర్ 9న ప్రాజెక్టుకు సీఎం కేసీఆర్ శంకుస్థాపన
మైండ్ స్పేస్ నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టు వరకు మెట్రో లైన్‌ను తెలంగాణ ప్రభుత్వం విస్తరించనుంది. ఈ ప్రాజెక్టుకు డిసెంబర్ 9వ తేదీన సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేయనున్నారు. మూడేళ్లలో ఈ ప్రాజెక్టు పూర్తిచేసేలా ప్రణాళికలు సిద్ధం చేశారు.

హైదరాబాద్: తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో మరో భారీ ప్రాజెక్టు చేపట్టడానికి సీఎం కేసీఆర్ ప్రభుత్వం సంకల్పించింది. శంసాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నగరానికి అనుసంధానిస్తూ నేరుగా మెట్రో సదుపాయాన్ని అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. మూడేళ్లలో ఈ మెట్రో ప్రాజెక్టు పూర్తి చేయనుంది.
మైండ్ స్పేస్ జంక్షన్ సమీపంలోని రాయదుర్గం మెట్రో టర్మినల్ నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టు వరకు మెట్రో కారిడార్‌ను విస్తరించాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. అంతేకాదు, ఈ ప్రాజెక్టుకు సీఎం కేసీఆర్ డిసెంబర్ 9న శంకుస్థాపన చేయనున్నారు. ఈ మెట్రో ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వమే నిర్మిస్తుందని సీఎం వెల్లడించారు.
ఈ మెట్రో లైన్ బయో డైవర్సిటీ జంక్షన్ కాజాగూడా రోడ్డు నుంచి ఔటర్ రింగ్ రోడ్డులోని నానక్ రామ్ గూడా జంక్షన్‌ను కలుపుతూ వెళ్లనుంది. విమానాశ్రయం నుంచి ప్రత్యేక మార్గం ద్వారా ఈ లైన్ వెళ్లుతుంది. మొత్తం 31 కిలోమీటర్ల పొడవుతో ఈ మెట్రో ప్రాజెక్టు నిర్మాణం చేస్తారు. ఇందుకోసం రూ. 6,250 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం వెచ్చించనుంది. ఈ మార్గం కీలకంగా మారనుంది. ఈ దారి వెంట పలు అంతర్జాతీయ సంస్థల కార్యాలయాలు వెలువబోతున్నాయి.
Also Read: గ్రేటర్ పరిధిలో విద్యార్థులకు ఆర్టీసీ గుడ్ న్యూస్.. మెట్రో కాంబి టికెట్ ధర తగ్గింపు..
విశ్వనగరంగా మారిన హైదరాబాద్‌లో భవిష్యత్ రవాణా అవసరాలను గుర్తిస్తూ, అందుకు అనుకూలమైన సదుపాయాలను కల్పించే దార్శనికతతో సీఎం కేసీఆర్ ఈ మెట్రో ప్రాజెక్టు నిర్ణయం తీసుకున్నారు.