Asianet News TeluguAsianet News Telugu

నిధుల గోల్‌మాల్.. తెలంగాణ సర్కార్ సీరియస్, తెలుగు అకాడమీ డైరెక్టర్‌పై వేటు

తెలుగు అకాడమీలో నిధుల గోల్‌మాల్ వ్యవహారం రెండు రాష్ట్రాల్లో కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం సీరియస్ అయ్యింది. అకాడమీ డైరెక్టర్ సోమిరెడ్డిపై వేటు వేసింది. ఆయన స్థానంలో అకాడమీ బాధ్యతలను విద్యాశాఖ కమీషనర్ దేవసేనకు అప్పగించింది. 

telangana govt take serious action on telugu academy director somireddy
Author
Hyderabad, First Published Oct 1, 2021, 7:35 PM IST

తెలుగు అకాడమీలో నిధుల గోల్‌మాల్ వ్యవహారం రెండు రాష్ట్రాల్లో కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం సీరియస్ అయ్యింది. అకాడమీ డైరెక్టర్ సోమిరెడ్డిపై వేటు వేసింది. ఆయన స్థానంలో అకాడమీ బాధ్యతలను ప్రాథమిక విద్యాశాఖ డైరెక్టర్ దేవసేనకు అప్పగించింది.తెలంగాణ ప్రభుత్వం జీవో అందిన వెంటనే దేవసేనకు బాధ్యతలు అప్పగించడానికి హుటాహుటిన బయలుదేరి వెళ్లారు.

ఆంధ్రప్రదేశ్ కు పంపకం చేయాల్సిన వాటాను తేల్చే సమయంలో అకాడమీ నిధుల గోల్ మాల్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. యూనియన్ బ్యాంక్ నుంచి,  మరో బ్యాంక్ నుంచి మొత్తం మూడు బ్రాంచ్ ల నుంచి 60 కోట్ల రూపాయలు వ్యక్తిగత ఖాతాలకు బదిలీ అయినట్లు వెలుగులోకి వచ్చాయి. 2014 సంవత్సరం లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 124 కోట్ల రూపాయలను బదిలీ చేయాల్సి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి 45 కోట్ల రూపాయలు వడ్డీ రూపంలోనూ 24 కోట్ల రూపాయల పెన్షన్ ఫండ్ రూపంలోనూ వెళ్తుంది. 

కాగా, తెలుగు అకాడమీ దాదాపు 34 బ్యాంకుల్లో ఫిక్స్ డ్ డిపాజిట్లు చేసినట్లు చెబుతున్నారు. తమ డబ్బులు భద్రంగా ఉన్నాయా, లేదా అనే విషయాన్ని తేల్చుకోవడానికి శుక్రవారంనాడు దాదాపు 20 మంది అకాడమీ ఉద్యోగులను రంగంలోకి దింపారు. ఆ బ్యాంకుల్లో డిపాజిట్లు భద్రంగానే ఉన్నట్లు భావిస్తున్నారు. అయితే, ఈ బ్యాంకుల్లో కోటి, ఐదు కోట్లు.. ఇలా తక్కువ మొత్తాల్లో డిపాజిట్ చేసినట్లు గుర్తించారు. ఇన్ని బ్యాంకుల్లో అంత చిన్న మొత్తాల్లో ఎందుకు ఫిక్స్ డ్ డిపాజిట్లు చేశారనే ప్రశ్నకు జవాబు లేదు. 

డిపాజిట్లు చేయడానికి అధికారం ఉన్న అకాడమీ అధికారులకు కూడా ఆ బ్యాంకులు ఎక్కడున్నాయనే విషయం తెలియదు. దాంతో ఆ బ్యాంకులను గుర్తించి, వాటికి చేరుకోవడానికి ఉద్యోగులు తీవ్రమైన ఇబ్బందులకు గురయ్యారు.

తెలుగు అకాడమీ నిధుల గోల్‌మాల్ కేసులో ఇప్పటి వరకు ముగ్గురు అరెస్ట్ అయ్యారు. బ్యాంక్‌ల నుంచి రూ.64 కోట్లను ఎఫ్‌డీల రూపంలో వీరు కాజేసినట్లు  పోలీసులు తేల్చారు. సోసైటీలో తెలుగు అకాడమీ పేరుతో ఫేక్ ఐడీలు రూపొందించారు నిందితులు. ఫేక్ ఐడీలు క్రియేట్ చేసి ఖాతాలు తెరిచారు నిందితులు. వీరిపై సీసీఎస్ పోలీస్ స్టేషన్‌లో మరో రెండు కేసులు నమోదు చేశారు. నిందితులపై 154/2021, u/sec, 409, 419, 420, 465, 467, 468, 471 R/w 34 ఐపీసీ కింద కేసులు నమోదు చేశారు.   

తెలుగు అకాడమీ నిధుల గోల్ మాల్ వ్యవహారంలో హైదరాబాదు నగర క్రైమ్ బ్రాంచ్ (సీసీఎస్) పోలీసులు మరొకరిని అరెస్టు చేశారు. ఏపీ మర్కంటైల్ కో ఆపరేటివ్ సొసైటి బ్యాంక్ చైర్మన్ సత్యనారాయణ రాజును పోలీసులు అరెస్టు చేశారు. తెలుగు అకాడమీ ఫిక్స్ డ్ డిపాజిట్ల బదలాయింపులో సత్యనారాయణ రాజు కీలక సూత్రధారిగా వ్యవహరించినట్లు పోలీసులు భావిస్తున్నారు.

అలాగే ఏపీ మర్కంటైల్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కో ఆపరేటివ్ సొసైటీ బ్యాంక్ ఉద్యోగి మొహినుద్దీన్ ను అరెస్టు చేశారు. దీంతో ఈ కేసులో ఇప్పటి వరకు సీసీఎస్ పోలీసులు ముగ్గురిని అరెస్టు చేశారు. తెలుగు అకాడమీకి చెందిన డబ్బులను ఆ బ్యాంకుకు బదిలీ చేసినట్లు, అక్కడి నుంచి ఒకరి ఖాతాలోకి డబ్బులు బదిలీ చేసినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో అతన్ని అరెస్టు చేశారు. 

తెలుగు అకాడమీ దాదాపు 34 బ్యాంకుల్లో నిధులను ఫిక్స్ డ్ డిపాజిట్ చేసినట్లు తెలుస్తోంది. అయితే, అకాడమీ అధికారులు రెండు లేదా మూడు నమ్మకమైన బ్యాంకులను ఎంపిక చేసుకుని ఫిక్స్ డ్ డిపాజిట్లు చేయకుండా అన్ని బ్యాంకుల్లో ఎందుకు చేశారనే ప్రశ్న ఉదయిస్తోంది. ఆ బ్యాంకుల్లో తమ నిధులు భద్రంగా ఉన్నాయా, లేవా అని గుర్తించే పనిలో తెలుగు అకాడమీ అధికారులు పడ్డారు. 

Follow Us:
Download App:
  • android
  • ios