హైదరాబాద్: న్యాయవాద దంపతులు వామన్ రావు, నాగమణి జంట హత్యల కేసుపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి పెట్టింది. వామన్ రావు దంపతుల హత్య కేసు విచారణకు ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేయాలని కోరుతూ ప్రభుత్వం హైకోర్టుకు లేఖ రాశారు. కరీంనగర్ లోని ఓ కోర్టును వామన్ రాపు దంపతుల హత్య కేసు విచారణకు కేటాయించాలని ప్రభుత్వం కోరింది.

మాజీ మంత్రి ఈటల రాజేందర్ కు పుట్ట మధు అత్యంత సన్నిహితుడనే అభిప్రాయం ఉంది. ఈటల కుమారుడితో కలిసి వ్యాపారాలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. దాదాపు 900 కోట్ల రూపాయల ఆస్తులను పుట్ట మధు కూడబెట్టినట్లు కూడా చెబుతారు. చాలా వరకు మహారాష్ట్రలో పుట్ట మధు బినామీల పేరుతో పెట్టుబడులు పెట్టినట్లు చెబుతారు. 

మహారాష్ట్రలోని వ్యాపారాలను పుట్ట మధు సోదరుడు పుట్ట సతీష్ చూసుకుంటారని చెబుతారు. వామన్ రావు హత్య కేసులో పుట్ట మధు చుట్టూ ఉచ్చు బిగిస్తోంది. ఈ కేసులో ఇప్పటికే పుట్ట మధు మేనల్లుడు బిట్టు శ్రీనును పోలీసులు అరెస్టు చేశారు 

Also Read: టీఆర్ఎస్ నేత, పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధు అరెస్టు

కాగా, టీఆర్ఎస్ నేత, పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధు చుట్టూ ఉచ్చు బిగిస్తోంది. న్యాయవాది దంపతులు వామన్ రావు, నాగమణి హత్య కేసులో ఆయనను రామగుండం టాస్క్ ఫోర్స్ పోలీసులు విచారిస్తున్నారు. వామన్ రావు తండ్రి కిషన్ రావు ఇటీవల ఇచ్చిన పిర్యాదు ఆధారంగా ఆయనను పోలీసులు విచారిస్తున్నట్లు తెలుస్తోంది. 

గత నెల 30వ తేదీ నుంచి కనిపించకుండా పోయిన పుట్ట మధు మహారాష్ట్ర, కేరళ, ఛత్తీస్ గడ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో తిరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాజమండ్రి, భీమవరాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఆయనను భీమవరంలోని ఓ హోటల్లో ఉండగా అదుపులోకి తీసుకున్నారు. 

Also Read: టీఆర్ఎస్ నేత, పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ పుట్ట మధు అదృశ్యం

పుట్ట మధుపై ఈ నెల 10వ తేదీన పోలీసులు చార్జిషీట్ దాఖలు చేసే అవకాశం ఉంది. వామన్ రావు దంపతుల హత్యకు రెండు రోజుల ముందు పుట్ట మధు 2 కోట్ల రూపాయలు బ్యాంక్ నుంచి డ్రా చేసినట్లు తెలుస్తోంది. వామన్ రావు దంపతుల హత్య కేసును కప్పిపుచ్చడానికి రెండు కోట్ల రూపాయలు సుపారీ ఇచ్చినట్లు ఆరోపణలు వస్తున్నాయి.

తన కుమారుడిని హత్య చేసేందుకే రెండు కోట్ల రూపాయలు పుట్ట మధు డ్రా చేశాడని వామన్ రావు తండ్రి కిషన్ రావు ఫిర్యాదు చేశారు. పది రోజుల పాటు పుట్ట మధు తన సోదరుడు పుట్ట సతీష్ తో కలిసి కారులో వివిధ రాష్ట్రాలు తిరిగాడు. వామన్ రావు దంపతుల హత్యకు వాడిన కారు పుట్ట మధు కొన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. పది రోజుల పాటు పుట్ట మధు ఎవరెవరిని కలిశాడనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. 

పుట్ట మధు ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటి నుంచే అక్రమ వసూళ్లకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. పుట్ట లింగమ్మ చారిటబుల్ ట్రస్టు ద్వారా ఆ వసూళ్లకు పాల్పడినట్లు చెబుతున్నారు. ఈ చారిటబుల్ ట్రస్టు వ్యవహారాలను బిట్టు శ్రీను చూసుకునేవాడు. శీలం రంగయ్య లాకప్ డెత్ వ్యవహారంలో కూడా పుట్ట మధు పాత్ర ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి.

రెండు కోట్ల రూపాయలు ఎందుకు డ్రా చేశారు, ఎలా ఖర్చు చేశారు అనే విషయాలపై కూడా పోలీసుుల విచారణ జరుపుతున్నారు. వామన్ రావు దంపతుల హత్య కేసు నిందితులు ప్రయాణించిన కారు వాస్తవానికి పుట్ట మధు కొన్నారా అనే కోణంలో కూడా పోలీసులు విచారణ జరుపుతున్నారు.

పుట్ట మధును శనివారంనాడు పోలీసులు భీమవరంలో అదుపులోకి తీసుకుని రామగుండం తరలించిన విషయం తెలిసిందే. వామన్ రావు హత్య కేసులోనే ప్రధానంగా ఆయనను విచారిస్తున్నట్లు తెలుస్తోంది.