టీఆర్ఎస్ నేత, పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ పుట్ట మధు అదృశ్యం
టీఆర్ఎస్ నేత, పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధు గత వారం రోజులుగా ఎవరికీ కనిపించడం లేదు. ఆయన ఎక్కడికి వెళ్లారనేది ఎవరూ చెప్పలేని పరిస్థితి ఉంది. ఆయన ఎక్కడికి వెళ్లారనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
మంథని: తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) నేత, పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధు అదృశ్యమయ్యారు. ఆయన ఎక్కుడున్నారనే విషయంపై ఎవరికీ అంతు పట్టడం లేదు. ఈ విషయంపై సోషల్ మీడియాలో విస్తారంగా చర్చ జరుగుతోంది. ఏప్రిల్ 30వ తేదీన మాజీ మంత్రి ఈటెల రాజేందర్ మీడియా సమావేశంలో మాట్లాడిన తర్వాత ఆయన కనిపించకుండా పోయారు.
పుట్ట మధు సెల్ ఫోన్ కూడా స్విచాఫ్ అయింది. ఆయన అదృశ్యంపై కుటుంబ సభ్యులు కూడా ఏమీ చెప్పలేకపోతున్నారు. కనీసం పోలీసులకు కూడా ఫిర్యాదు చేయలేదు. దీంతో ఆయన ఆచూకీపై పోలీసులు కూడా ఏమీ చెప్పలేకపోతున్నారు. ఈటెల రాజేందర్ కు వ్యతిరేకంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా టీఆర్ఎస్ నేతలు పెట్టిన మీడియా సమావేశానికి కూడా రాలేదు.
రేపు రావాల్సిందిగా గన్ మెన్ కు చెప్పారు. మర్నాడు తెల్లారి గన్ మెన్ వచ్చే సరికి ఆయన కనిపించలేదు. ఎక్కడికి వెళ్లాడనే విషయంపై ఆయన గన్ మెన్ కు కూడా తెలియడం లేదు.
అయితే, ఆయన మహారాష్ట్రలోని రాయపూర్ లో ఉన్నారనే ప్రచారం సాగుతోంది. మరోవైపు కర్ణాటక వెళ్లినట్లు కూడా ఊహాగానాలు చెలరేగుతున్నాయి. బుధవారం రాత్రి మంత్రి కొప్పుల ఈశ్వర్ ను కూడా కలిశారని కొంత మంది అంటున్నారు. అయితే. ఈ వార్తలేవీ నిర్ధారణ కావడం లేదు.
పుట్ట మధు గురువారం సాయంత్రం బయటకు వస్తారని కూడా అంటున్నారు. మాజీ మంత్రి ఈటెలకు వ్యతిరేకంగా ఆయన మిగతా టీఆర్ఎస్ నేతలతో కలిసి మాట్లాడుతారని అంటున్నారు. అయితే, ఈ విషయం కూడా నిర్ధారణ కావడం లేదు.
ఆ మధ్య పెద్దపల్లిలో న్యాయవాది వామన్ రావు దంపతుల హత్య జరిగిన సమయంలో పుట్ట మధుపై కూడా విమర్శలు వచ్చాయి.