రైతు బంధు పథకం నిమిత్తం తెలంగాణ ప్రభుత్వం మంగళవారం మరో రూ.550 .14 కోట్లు విడుదల చేసింది. ఇప్పటి వరకు మొత్తం 62,45,700 మంది రైతుల ఖాతాలలో రూ.6351.22 కోట్లు జమ చేసినట్లు మంత్రి నిరంజన్ పేర్కొన్నారు.
రైతు బంధు పథకంలో భాగంగా రైతులకు తెలంగాణ ప్రభుత్వం పెట్టుబడి సాయం అందిస్తున్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం మరో రూ.550 .14 కోట్లు విడుదల చేసింది. మొత్తం 1,60,643 మంది రైతుల ఖాతాల్లో నగదు జమ అయ్యే విధంగా ఈ నిధులు విడుదల చేసినట్లు మంత్రి నిరంజన్ రెడ్డి వెల్లడించారు. ఇప్పటి వరకు మొత్తం 62,45,700 మంది రైతుల ఖాతాలలో రూ.6351.22 కోట్లు జమ చేసినట్లు పేర్కొన్నారు. ఇక ఖమ్మం వేదికగా జరిగే బీఆర్ఎస్ బహిరంగ సభ నవశకానికి నాంది పలకబోతోందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.
ఖమ్మం సభలో కేసీఆర్ చారిత్రాత్మక సందేశం ఇవ్వబోతున్నారని నిరంజన్ రెడ్డి తెలిపారు. ఇప్పటికే అన్ని రంగాలను అమ్మేసిన కేంద్రం కన్ను.. ఇప్పుడు ఆహారరంగం మీద పడిందన్నారు. సంక్షేమ పథకాలు దేశమంతటా అమలు కావాలని భారత ప్రజలు ఆశిస్తున్నారని మంత్రి వ్యాఖ్యానించారు. తెలంగాణ మీద కట్టబెట్టిన కేంద్రం కావాలనే రాష్ట్రానికి నిధులు రాకుండా అడ్డుకుంటోందని ఆయన ఆరోపించారు. బీజేపీకి జనమే సమాధానం చెబుతారని నిరంజన్ రెడ్డి జోస్యం చెప్పారు.
Also Read: తెలంగాణ రైతాంగానికి శుభవార్త.. ఈ నెల 28 నుంచి రైతుబంధు, హరీశ్‌రావుకు కేసీఆర్ ఆదేశం
కాగా.. తెలంగాణలో మొదటిసారి టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టింది. అందులో రైతుల కోసం రెండు ముఖ్యపథకాలు తీసుకొచ్చింది. అందులో ఒకటి రైతుబంధు కాగా మరొకటి రైతుబీమా. ఈ రెండు పథకాలను రైతులను విశేషంగా ఆకర్షించాయి. గతంలో ఉన్న ఏ ప్రభుత్వాలు ఇలాంటి పథకాలు తీసుకురాకపోవడంతో సీఎం కేసీఆర్ ఈ రెండు పథకాలతో రైతులకు దగ్గరయ్యారు. పట్టదారు పాసు పుస్తకం ఉన్న రైతు చనిపోతే ఏ కారణంతో చనిపోయినా కుటంబానికి రూ.5 లక్షల బీమా అందించడం రైతు బీమా పథకం ఉద్దేశమైతే, పంట పెట్టుబడికి కావాల్సిన ఆర్థిక వనరులు సమకూర్చడం రైతుబంధు పథకం ఉద్దేశం.
ప్రతీ ఏటా రెండు విడతలుగా అంటే వానాకాలం సీజన్‌కు ముందు, యాసంగి సీజన్‌కు ముందు ఎకరానికి రూ.5 వేల చొప్పున పంట పెట్టుబడికి ప్రభుత్వం సాయంగా అందిస్తోంది. ఇది డైరెక్ట్ గా రైతుల బ్యాంక్ అకౌంట్‌లో క్రిడిట్ అవడం, మధ్యలో ఎలాంటి వారికి డబ్బులు చెల్లించాల్సి రాకపోవడంతో రైతులు ఈ పథకం పట్ల బాగా ఆకర్శితులయ్యారు. టీఆర్ఎస్‌ను రెండో సారి అధికారంలోకి తీసుకురావడానికి ఈ పథకం కీలక పాత్ర పోషిందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.
