హైదరాబాద్: భారీ వర్షాలు, వరదల కారణంగా సర్టిఫికెట్లు కోల్పోయిన  విద్యార్ధులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ధరఖాస్తు చేసుకొన్న విద్యార్ధులకు ఉచితంగా సర్టిఫికెట్లను ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది.

ఈ నెల 13వ తేదీ నుండి హైద్రాబాద్ నగరంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇంకా రెండు మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

వర్షాల కారణంగా నగరంలోని పలు కాలనీలు ఇప్పటికే నీటిలో మునిగిపోయాయి. వందలాది మంది సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు. మరికొందరిని ప్రభుత్వం పునరావాస కేంద్రాలకు తరలించింది.

వర్షాలు, వరదలతో నగరంలోని పలు కాలనీల్లో జనం నిలువ నీడలేకుండా పోయారు. చాలామంది విద్యార్ధుల సర్టిఫికెట్లు నీటిలో కొట్టుకుపోయాయి. మరికొందరి సర్టిఫికెట్లు పాడయ్యాయి. 

దీంతో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకొంది.  ధరఖాస్తు చేసుకొన్న విద్యార్థులకు సర్టిఫికెట్లను జారీ చేయనున్నట్టుగా ప్రకటించింది. ఈ మేరకు విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన  కార్యదర్శి చిత్రా రామచంద్రన్ మంగళవారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది.

also read:వర్షం ఎఫెక్ట్: తెలంగాణలో అన్ని పరీక్షలు వాయిదా

ఈ మేరకు పాఠశాల, ఇంటర్మీడియట్, సాంకేతిక విద్యాశాఖతో పాటు విశ్వవిద్యాలయాల రిజిస్ట్రార్లు  చర్యలు చేపట్టాలని ఆదేశించారు.విద్యార్ధులు దరఖాస్తు చేసుకొనే సమయంలో తమ పూర్తి వివరాలు, పరీక్ష, హాల్ టికెట్టు, నెంబర్, సంవత్సరం తదితర వివరాలను అందించాలని ప్రభుత్వం సూచించింది.