Asianet News TeluguAsianet News Telugu

కేఆర్ఎంబీకి తెలంగాణ లేఖ: నీటి విడుదల.. శ్రీశైలం, పోతిరెడ్డిపై మరోసారి ఫిర్యాదు

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ)కు గురువారం తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసింది. శ్రీశైలంలో 880 అడుగులపైన నీరు ఉన్నప్పుడూ ఏపీ 34 టీఎంసీలే తీసుకోవాలని లేఖలో వివరించారు. పోతిరెడ్డిపాడు, ఎస్‌ఆర్‌ఎంసీని అనుమతులు లేని ప్రాజెక్టులుగా పేర్కొనాలని కేఆర్ఎంబీని తెలంగాణ ప్రభుత్వం కోరింది. 

telangana govt letter to krmb chairman
Author
Hyderabad, First Published Sep 9, 2021, 9:32 PM IST


కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ)కు గురువారం తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసింది. ఈ మేరకు నీటిపారుదల శాఖ ఈఎన్‌సీ మురళీధర్‌ రావు .. బోర్డు ఛైర్మన్‌కు పోతిరెడ్డిపాడు, శ్రీశైలం కుడి కాలువ ద్వారా ఏపీకి నీటి విషయంలో లేఖ రాశారు. ఏపీ 34 టీఎంసీలకు మించి నీరు తీసుకోకుండా చూడాలని ఆయన కోరారు. శ్రీశైలంలో 880 అడుగులపైన నీరు ఉన్నప్పుడూ ఏపీ 34 టీఎంసీలే తీసుకోవాలని లేఖలో వివరించారు. ఏపీ చేపట్టిన అన్ని ప్రాజెక్టులను గెజిట్‌లో చేర్చాలని ఈఎన్‌సీ మురళీధర్ రావు లేఖలో విజ్ఞప్తి చేశారు. ప్రాజెక్టు పనులను గెజిట్‌లో రెండో షెడ్యూల్‌లో చేర్చాలని ఆయన కోరారు.  

పోతిరెడ్డిపాడు ద్వారా అక్రమంగా అధిక జలాలు తరలిస్తున్నారని.. 880 అడుగుల పైనుంచే పోతిరెడ్డిపాడు ద్వారా నీరు తీసుకోవాలన్నారు. 11,150 క్యూసెక్కుల వరకు నీటిని విడుదల చేసేందుకే ప్రాజెక్టు డిజైన్‌ చేశారని ఈఎన్‌సీ వెల్లడించారు. అదే సమయంలో శ్రీశైలం కుడి ప్రధాన కాలువను 20 వేల క్యూసెక్కులకు పెంచారని ఆయన తెలిపారు. వరద సమయాల్లో జులై-అక్టోబర్‌ మధ్య మాత్రమే నీరు వదలాలని పేర్కొన్నారు. 34 టీఎంసీలకు మించి తీసుకోవడానికి ఏపీకి  జలసంఘం అనుమతి లేదని మురళీధర్ రావు స్పష్టం చేశారు. ఈ మేరకు శ్రీశైలం నుంచి నీటి విడుదలను వెంటనే ఆపేయాలని.. పోతిరెడ్డిపాడు, ఎస్‌ఆర్‌ఎంసీని అనుమతులు లేని ప్రాజెక్టులుగా పేర్కొనాలని కేఆర్ఎంబీని తెలంగాణ ప్రభుత్వం కోరింది. 

Follow Us:
Download App:
  • android
  • ios