FREE current:  ‘గృహ జ్యోతి’ (Gruha Jyothi Scheme) పథకం లబ్దిదారులకు సంబంధించిన మార్గదర్శకాలను తెలంగాణ ప్రభుత్వం జారీ చేసింది. లబ్ధిదారుల ఎంపికలో పారదర్శకత కోసమే ఆధార్‌ను తప్పనిసరి చేస్తూ..  ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 

Free current: ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలు దిశగా అడుగులెస్తుంది. ఇప్పటికి రెండు పథకాలను అమలు చేస్తున్న రేవంత్ సర్కార్.. తాజాగా మరో పథకం అమలు దిశగా మార్గదర్శకాలను జారీ చేసింది. ఆ పథకమే గృహ జ్యోతి (Gruha Jyothi Scheme). రాష్ట్రంలో ప్రతి ఇంటికీ ప్రతి నెలా 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ను అందించాలనే ఉద్దేశించిన పథకం ఇది. 200లు లేదా అంతకంటే తక్కువ యూనిట్ల విద్యుత్‌ను వినియోగించే వారికి ఉచితంగా విద్యుత్ అందజేయనున్నది. ఈ మేరకు గృహ జ్యోతి పథకం అమలు చేయడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. దీనికి అవసరమైన మార్గదర్శకాలను కాంగ్రెస్ సర్కార్ జారీ చేసింది. ఈ మేరకు విద్యుత్ మంత్రిత్వ శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ఏఎం రిజ్వీ నోటిఫికేషన్‌ను జారీ చేశారు.

ఈ పథకం లబ్ధిదారులకు ఆధార్‌ కార్డును తప్పనిసరి చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. లబ్ధిదారుల ఎంపికలో పారదర్శకత కోసమే ఆధార్‌ను తప్పనిసరి చేస్తున్నట్లు వెల్లడించింది. విద్యుత్తు కనెక్షన్‌ నంబర్‌ను, లబ్ధిదారుల ఆధార్‌తో అనుసంధానం చేయనున్నట్టు తెలిపింది. ఇందుకోసం ప్రత్యేకంగా అధికారులను నియమిస్తామని చెప్పింది. సిబ్బంది క్షేత్ర స్థాయి పరిశీలనకు వచ్చినప్పుడు కచ్చితంగా ఆధార్‌ చూపించాలని సూచించింది. వారు.. బయోమెట్రిక్‌ను తీసుకుంటారని, బయోమెట్రిక్‌ సరిగ్గా పనిచేయకుంటే ఐరిస్‌ను స్కాన్ చేస్తారని తెలిపింది. ఐరిస్ కూడా సరిగ్గా రాకుంటే.. ఫొటో తీసుకుంటారని ఉత్తర్వుల్లో వివరించింది. ఇవన్నీ సాధ్యం కానీ పక్షంలో లబ్ధిదారుడి ఆధార్ క్యూఆర్‌ కోడ్ సహాయంతో వివరాలు తెలుసుకోనున్నట్లు వెల్లడించింది.

ఈ పథకం ద్వారా లబ్ది పొందాలంటే మాత్రం ఆధార్‌ తప్పని సరి చేసింది. ఆధార్ లేకపోతే వెంటనే నమోదు చేయించుకోవాలని సూచించింది. అథెంటిఫికేషన్‌ చేసే సమయంలో ఆధార్‌ ఎన్‌రోల్‌మెంట్‌ నంబర్‌ సిబ్బందికి చూపించాల్సి ఉంటుందని పేర్కొన్నది. ఆధార్‌ నంబర్‌ వచ్చే వరకు ఆధార్‌ నమోదు నంబర్‌తోపాటు సపోర్టింగ్ డాక్యుమెంట్‌ కింద ఫొటో ఉన్న బ్యాంకు లేదా పోస్టాఫీస్ పాస్ బుక్, పాన్, పాస్‌పోర్ట్‌, రేషన్‌కార్డు, ఓటర్‌ ఐడీ, ఉపాధి హామీ పథకం కార్డు, కిసాన్‌ పాస్‌బుక్‌, డ్రైవింగ్‌లైసెన్స్‌ లేదా గెజిటెడ్‌ అధికారి సంతకం చేసిన ధ్రువీకరణ పత్రం సమర్పించాల్సి ఉంటుందని పేర్కొన్నది. అయితే.. ఈ పథకం ఎప్పటి నుంచి అమలవుతుందనే విషయం అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.