వైఎస్ షర్మిలకు తెలంగాణ ప్రభుత్వం భద్రత కల్పించింది. షర్మిల తెలంగాణ రాజకీయాల్లోకి అడుగుపెడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె వరసగా కార్యకర్తలతో భేటీ కూడా అవుతున్నారు. ఈ క్రమంలో.. ఆమెకు తెలంగాణ ప్రభుత్వం భద్రత కల్పించింది.

నలుగురు వ్యక్తిగత భద్రతా సిబ్బందిని ఆమెకు కేటాయించింది. షర్మిల ఖమ్మంలో శుక్రవారం భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. ఆమె పెట్టబోయే పార్టీ పేరును కూడా ఖమ్మం సభలోనే ప్రకటించనున్నారు. ఇప్పటికే సభకు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. 

ఈ సభకు ప్రభుత్వం ఆంక్షలతో కూడిన అనుమతులు మంజూరు చేసింది. తెలంగాణ జిల్లాల వైఎస్ అభిమానులు, కార్యకర్తలతో సమ్మేళనాలు నిర్వహించిన షర్మిల.. వైఎస్ ఆశయాల కోసమే తాను పార్టీ పెడుతున్నట్లు తెలిపారు. ఇక ఖమ్మం సభకు ముఖ్య అతిథిగా వైఎస్ విజయమ్మ హాజరుకానున్నారని సమాచారం.