రేపటి నుంచి ధాన్యం కొనుగోళ్లు జరపనున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపట్టింది. అలాగే ఇతర రాష్ట్రాల నుంచి వరి రాష్ట్రంలోకి రాకుండా సరిహద్దుల్లో 51 చెక్‌పోస్టులు ఏర్పాటు చేసింది.
రైతుల వద్ద నుంచి ధాన్యం తామే కొనుగోలు చేస్తామని (paddy procurement) తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ (kcr) ప్రకటించిన నేపథ్యంలో రాష్ట్ర సరిహద్దుల వద్ద గట్టి నిఘా ఏర్పాటు చేశారు. బయటి రాష్ట్రాల నుంచి తెలంగాణలోకి వరి రాకుండా చర్యలు చేపట్టారు. ప్రధానంగా మహారాష్ట్ర (maharashtra) నుంచి వరి ధాన్యం రాకుండా చూడాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. ఈ నేపథ్యంలో నాలుగు రాష్ట్రాల సరిహద్దుల్లో 51 చోట్ల పోలీస్ డిపార్ట్‌మెంట్‌తో కలిసి చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు అధికారులు. కొనుగోలు కేంద్రం దగ్గర నోడల్ ఆఫీసర్, మిల్లుల దగ్గర స్పెషల్ ఆఫీసర్లు విధులు నిర్వర్తించనున్నారు. రేపటి నుంచి వరి కొనుగోళ్లు ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది. క్వింటాల్ వరికి రూ.1960 ధర ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం.
మరోవైపు.. రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం నుంచి వరిధాన్యం కొనుగోళ్లు ప్రారంభిస్తామని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ (gangula kamalakar) అన్నారు. మే నెలాఖరు లేదా జూన్ మొదటి వారంలోగా కసరత్తు పూర్తి చేస్తామని చెప్పారు. ధాన్యం కొనుగోలుకు సంబంధించి అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ యాసంగి సీజన్‌లో 34 లక్షల ఎకరాల్లో వరి సాగు చేయగా 65 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు కేంద్రాలకు వస్తాయని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం క్వింటాల్‌కు రూ.1,960 చొప్పున మొత్తం స్టాక్‌ను కొనుగోలు చేస్తుందని మంత్రి ప్రత్యేకంగా రైతులకు తెలియజేశారు. రైతులు వరి కొనుగోలు కేంద్రాల్లోనే తమ పంటను అమ్ముకోవాలని కోరారు. మధ్యవర్తులకు విక్రయించవద్దని సూచించారు.
ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన నిల్వలను కొనుగోలు కేంద్రాల్లో కొనుగోలు చేయకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. తెలంగాణలో పండిన ధాన్యం మాత్రమే రాష్ట్ర కొనుగోలు కేంద్రాల్లో కొంటామని తెలిపారు. రైతులు కొనుగోలు కేంద్రాలకు చేరుకున్న వెంటనే వారి వివరాలను డ్యాష్‌బోర్డ్‌లో ప్రదర్శిస్తామని, రైతులకు వన్ టైమ్ పాస్‌వర్డ్ (ఓటీపీ) పంపిస్తామని మంత్రి గంగుల కమలాకర్ వివరించారు. ధాన్యం సేకరణ కసరత్తు కోసం దాదాపు 15 కోట్ల గన్నీ బ్యాగులు అవసరం అవుతాయని తెలిపారు. అయితే, ప్రస్తుతం దాదాపు 1.60 కోట్ల బస్తాలు సంబంధిత శాఖ వద్ద అందుబాటులో ఉన్నాయని తెలిపారు. నిల్వ కేంద్రాలకు తరలించేందుకు రవాణా సౌకర్యాలతో పాటు అవసరమైన సంఖ్యలో బస్తాలను వెంటనే కొనుగోలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
గోడౌన్లను ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌సిఐ) (fci) నియంత్రిస్తున్నందున, ఆయా జిల్లాల్లోని అనుకూలమైన ప్రదేశాలలో నిల్వలను నిల్వ చేయాలని మంత్రి గంగుల కమలాకర్ అధికారులను ఆదేశించారు. తెలంగాణ రైతులకు న్యాయం జరగాలనే ఈ నిర్ణయం తీసుకున్నామని వివరించారు. రైతులకు ఎక్కడా నష్టం జరగకుండా ఎంఎస్‌పీ ఇవ్వాలని జిల్లా అధికారులను ఆదేశించారు.
