తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఎమ్మెల్యేల కొనుగోలు కేసును సీబీఐకి అప్పగిస్తూ హైకోర్ట్ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును తెలంగాణ ప్రభుత్వం సవాల్ చేసింది

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఎమ్మెల్యేల కొనుగోలు కేసును సీబీఐకి అప్పగిస్తూ హైకోర్ట్ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును తెలంగాణ ప్రభుత్వం సవాల్ చేసింది. ఈ మేరకు బుధవారం అప్పీల్ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై తెలంగాణ హైకోర్ట్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ధర్మాసనం విచారించనుంది. 

ఇదిలావుండగా... ఎమ్మెల్యేల ప్రలోభాల కేసును సీబీఐతో విచారణ చేసేందుకు తెలంగాణ హైకోర్టు గతేడాది డిసెంబర్‌లో అనుమతి ఇచ్చింది. గతేడాది అక్టోబర్ 26న నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురి చేస్తూ పోలీసులకు ముగ్గురు పట్టుబడ్డారు.అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు,పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు, కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి , తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డిలను ప్రలోభాలకు గురి చేశారని పోలీసులకు ఫిర్యాదు అందింది.ఈ విషయమై తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఫిర్యాదు మేరకు మొయినాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో రామచంద్రభారతి,సింహయాజీ,నందకుమార్ లను పోలీసులు అరెస్ట్ చేశారు. 

ఈ కేసు విచారణకు గాను హైద్రాబాద్ సీపీ సీవీ ఆనంద్ నేతృత్వంలో సిట్ ను ఏర్పాటు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.అయితే సిట్ తో కాకుండా సీబీఐ లేదా స్వతంత్ర దర్యాప్తు సంస్థతో విచారణ కోరుతూ బీజేపీ పిటిషన్ దాఖలు చేసింది.బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి తో పాటు మరో నలుగురు ఇదే డిమాండ్ తో పిటిషన్లను దాఖలు చేశారు.అయితే టెక్నికల్ అంశాలను ప్రాతిపదికగా తీసుకున్న తెలంగాణ హైకోర్టు బీజేపీ సహా మరొకరి పిటిషన్ ను కొట్టివేసింది.ఈ కేసును సీబీఐ విచారణ కోరుతూ మరో ముగ్గురు దాఖలు చేసిన పిటిషన్లను సీబీఐ పరిగణనలోకి తీసుకుంది. అంతేకాదు సిట్ దర్యాప్తును నిలిపివేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.ఈ పరిణామాలు తెలంగాణ ప్రభుత్వానికి షాక్ ను కలిగించాయి.

Also Read: ఎమ్మెల్యేల కొనుగోలు కేసు.. సీబీఐ చేతికి అందుకే : 26 తీర్పులు, 45 అంశాలు ప్రస్తావించిన హైకోర్ట్

కాగా... ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కీలక విషయాలు ప్రస్తావించింది హైకోర్ట్. దర్యాప్తు సమాచారం సీఎంకు చేరవేతపై హైకోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం ముమ్మాటికీ తప్పేనని.. సీఎంకు సాక్ష్యాలు ఎవరిచ్చారో చెప్పడంలో సిట్ విఫలమైందని ధర్మాసనం అభిప్రాయపడింది. దర్యాప్తు ఆధారాలు బహిర్గతం చేయడం వల్ల విచారణ సక్రమంగా జరగదని కోర్ట్ వ్యాఖ్యానించింది. 

సీఎం కేసీఆర్ నిర్వహించిన ప్రెస్‌మీట్‌ను కూడా ఆర్డర్ కాపీలో ప్రస్తావించింది ధర్మాసనం. కోర్ట్ ఆర్డర్‌లో సిట్ ఉనికిని ప్రశ్నించింది. ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ తన పరిధి దాటి వ్యవహరించిందని హైకోర్ట్ అభ్యంతరం వ్యక్తం చేసింది. కోర్ట్‌కి సమర్పించాల్సిన డాక్యుమెంట్స్‌ని బహిర్గతం చేశారని.. 26 కేసుల జడ్జిమెంట్లను కోట్ చేస్తూ తీర్పు ఇచ్చింది హైకోర్ట్. అలాగే మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కేసును ప్రస్తావించింది ధర్మాసనం. సీబీఐకి ఇవ్వడానికి 45 అంశాలను చూపిస్తూ హైకోర్ట్ తీర్పు వెలువరించింది. ఈ మేరకు తెలుగు వార్తా సంస్థ ఎన్టీవీ తన కథనాన్ని ప్రసారం చేసింది.