తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి దుకాణాలు, రెస్టారెంట్లు, మాల్స్ 24 గంటల పాటు తెరిచి ఉంచుకునేందుకు వీలు కల్పించింది. ఈ మేరకు తెలంగాణ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్‌మెంట్ యాక్ట్ 1988ను ప్రభుత్వం సవరించింది.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఓ సంచలన నిర్ణయం తీసుకుంది. వ్యాపారులతో పాటు నగరవాసులకు ఓ శుభవార్త చెప్పింది. సమయం మించిపోతుంది షాష్ మూసేయాలి. లేకపోతే.. పోలీసులతో పారేషాన్ ర్రా బాబు అని వ్యాపారులు టెన్షన్ పడే రోజులు పోయాయి. అటు కస్టమర్లకు కూడా.. లేట్ అయితే.. షాపులు మూసివేస్తారనే టెన్షన్ లేకుండా.. ఎప్పుడూ పాటితే.. అప్పడు షాపింగ్ చేసే రోజులొచ్చాయి. ఇకపై రేయిపగలూ అనే తేడా లేకుండా దుకాణాలు తెరుచుకుని వ్యాపారం చేసుకోవచ్చు. అంటే.. 24 గంటల పాటు దుకాణాలు, రెస్టారెంట్లు, మాల్స్ ఓపెన్ చేసి ఉంచుకునేందుకు వీలుగా సర్కార్ పర్మిషన్ ఇచ్చింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
తెలంగాణ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్‌మెంట్ యాక్ట్ 1988ను తెలంగాణ సర్కార్ సవరించింది. ఆ చట్టంలోని సెక్షన్ 7 ప్రకారం.. లైసెన్సు తీసుకున్న దుకాణాలు ఏవైనా ఇక నుంచి 24 గంటలు తెరిచే ఉంచేలా ప్రభుత్వం వీలు కల్పించింది. అయితే.. ఈ మేరకు సదరు యాజమాన్యం సంవత్సరానికి రూ. 10 వేల చొప్పున అదనపు రుసుము చెల్లించాల్సి ఉంటుంది. అలా అదనపు రుసుము చెల్లించాలినా.. వారు సంవత్సరం పొడవునా 24/7 దుకాణం తెరిచే ఉంచుకోవచ్చని కార్మిక ఉపాధి కల్పన శాఖ ఉత్తర్వులు జారీచేసింది. అయితే… షాపులను 24 గంటలు తెరుచుకుని ఉంచాలంటే.. అదనపు ఫీజుతో పాటు మరో 10 షరతులను కూడా పాటించాలని రాష్ట్ర ప్రభుత్వం సూచించింది. ఆ షరతులను పాటిస్తేనే ఈ వెసులుబాటు ఉంటుందని పేర్కొంది.
తెలంగాణ సర్కార్ పెట్టిన 10 షరతులు ఇవే..
1.యాజమాన్యం లేదా షాప్ ఓనర్ తమ దగ్గర పనిచేసే సిబ్బందికి కచ్చితంగా గుర్తింపు కార్డు జారీ చేయాలి.
2. సిబ్బందికి అనుకూలంగా వీక్లీ ఆఫ్ విధానాన్ని అమలు పరచాలి.
3. సిబ్బందికి ప్రతీ వారం నిర్దిష్ట పని గంటలు కేటాయించాలి. ఆ మేరకే విధులకు హాజరయ్యే విధంగా చూడాలి.
4. ఒకవేళ ఓవర్ టైమ్ పని చేయించుకుంటే.. అందుకు తగిన విధంగా.. సదరు ఉద్యోగికి (ఓవర్ టైమ్) జీతాన్ని చెల్లించాలి.
5. ప్రభుత్వ సెలవుదినాలు, జాతీయ సెలవులు, వీక్లీ ఆఫ్ రోజుల్లో పనిచేసిన ఉద్యోగికి.. దానికి బదులుగా మరో రోజున సెలవు(సీ-ఆఫ్) ఇవ్వాలి.
6. మహిళలకు తగిన భద్రత కల్పించాలి. షాప్స్, మాల్స్, రెస్టారెంట్స్‌లో పనిచేసే మహిళ ఉద్యోగులకు తగిన ఏర్పాటు చేయాలి.
7. ఒక్క వేళ రాత్రి పూట మహిళా సిబ్బంది పనిచేస్తే..వారి నుంచి రాతపూర్వక సమ్మతిని తీసుకోవాలి.
8. రాత్రి వేళల్లో పనిచేసే మహిళలకు యాజమాన్యం లేదా యాజమానే రవాణా సౌకర్యాన్ని కల్పించాలి.
9. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల అనుగుణంగా రికార్డులను నిర్వహించాలి.
10. పోలీసు యాక్టు నిబంధనలకు అనుగుణంగా ఈ దుకాణాలు 24 గంటలు పనిచేయడం ఆధారపడి ఉంటుంది.
ప్రభుత్వం తీసుకున్న ఈ కీలక నిర్ణయంతో.. అటు దుకాణాదారులకు వ్యాపారం పెరగటంతో పాటు కస్టమర్లకు కూడా ఏ సమయంలోనైనా అన్ని సౌకర్యాలు పొందే వీలుంటుంది. అలాగే.. యువతకు ఉపాధి మార్గాలు కూడా పెరుగుతాయని పలువురు భావిస్తున్నారు.
