రేపటి నుంచి ధరణి పోర్టల్‌లో వ్యవసాయేతర భూముల ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు తెలంగాణ ప్రభుత్వం అనుమతించింది. ఆస్తి పన్ను, గుర్తింపు సంఖ్య ఖచ్చితంగా ఉండాలని హైకోర్టు నిబంధనకు ప్రభుత్వం సైతం అంగీకారం తెలిపింది.

కాగా, గురువారం ధరణి పోర్టల్‌పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. రిజిస్ట్రేషన్‌లపై స్టే ఇవ్వలేమని న్యాయస్థానం మరోసారి స్పష్టం చేసింది. పాత పద్దతిలో రీజిస్ట్రేషన్ చేస్తే తమకేం అభ్యంతరం లేదని తెలిపింది.

రిజిస్ట్రేషన్‌లు గతంలో సీఏఆర్‌డీ పద్దతిలో జరిగాయని.. ప్రస్తుతం అదే పద్దతి కొనసాగించాలని పిటిషనర్ తరపున న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అలాగే ఆన్‌లైన్ స్లాట్ బుకింగ్ గతంలో మాదిరిగానే రిజిస్ట్రేషన్ చేసుకునే విదంగా చూడాలని అడ్వొకేట్ జనరల్ కోరారు.

Also Read:ధరణి: వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

అయితే ఆధార్ కార్డు వివరాలను ధరణిలో నమోదు కోసం అడగవద్దని పిటీషనర్ తరపు న్యాయవాది కోరారు. దీనిపై స్పందించిన హైకోర్టు రూల్స్ 221, 230 ఏపీ అండ్‌ తెలంగాణ రాష్ట్ర రిజిస్ట్రేషన్ , సెక్షన్‌ 70B ప్రకారం తెలంగాణ మొత్తం నోటిఫై చేయాలని దేశించింది.

నాన్‌ అగ్రికల్చర్ ఆస్తులను ప్రభుత్వం రిజిస్ట్రేషన్ చేయొచ్చని హైకోర్టు సూచించింది. స్లాట్ బుకింగ్‌తో పాటు పీటీఐఎన్‌ ఆధారంగా ఉన్న పద్దతిలోనే రిజిస్ట్రేషన్ చేయాలని విజ్ఞప్తి చేసింది.

నాన్‌ అగ్రికల్చర్ ఆస్తులకు, పీటీఐఎన్‌ లేనివాళ్లకు రెండు రోజుల్లో ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. ఆ తర్వాత డాక్యుమెంట్స్ రిజిస్ట్రేషన్ చేయాలని కోరుతూ, తదుపరి విచారణను డిసెంబర్ 16 వాయిదాకు వేసింది