Asianet News TeluguAsianet News Telugu

జూన్ 22న ఆషాడ బోనాలు ప్రారంభం.. రూ. 15 కోట్లు కేటాయించిన ప్రభుత్వం..

ఈ ఏడాది ఆషాడ బోనాల ఉత్సవాల కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూ. 15 కోట్లు కేటాయించింది. ఈ మేరకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వివరాలను వెల్లడించారు. 

Telangana govt allocates 15 cr for Ashada Bonalu Says Minister Talasani Srinivas Yadav ksm
Author
First Published May 26, 2023, 3:47 PM IST

హైదరాబాద్: ఈ ఏడాది ఆషాడ బోనాల ఉత్సవాల కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూ. 15 కోట్లు కేటాయించింది. ఈ మేరకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వివరాలను వెల్లడించారు. నగరంలో ఆషాడ బోనాల ఏర్పాట్లపై మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, ఇంద్రకరణ్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి, డీజీపీ అంజనీకుమార్ సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో వివిధ శాఖల అధికారులు, ఆలయ కమిటీల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. తెలంగాణకు ఆషాడ మాసం బోనాలు, మహంకాళి జాతర చాలా ప్రత్యేకమని గుర్తుచేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ బోనాలను రాష్ట్ర పండుగగా ప్రకటించారన్నారు.

వివిధ శాఖల మధ్య సమన్వయంతో నగరంలో ఉత్సవాలు సజావుగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తామని మంత్రి తలసాని చెప్పారు. ఈ ఉత్సవాల్లో లక్షలాది మంది భక్తులు పాల్గొంటారని.. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. జూన్ 20న బల్కంపేట ఎల్లమ్మ కల్యాణం జరగనుందని చెప్పారు. 

జూన్ 22న గోల్కొండలో బోనాలు ప్రారంభం అవుతాయని చెప్పారు. జూలై 9న సికింద్రాబాద్ మహంకాళి బోనాలు, జూలై 10న రంగం, జూలై 16న పాతబస్తీలో బోనాలు జరుగుతాయని.. జూలై 17న నిర్వహించే ఊరేగింపుతో బోనాల ఉత్సవాలు ముగుస్తాయని చెప్పారు. బోనాల ఉత్సవాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 15 కోట్లు కేటాయించిందని వెల్లడించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios