తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన వేళ గవర్నర్ తమిళిసై యాదాద్రి పర్యటన ప్రాముఖ్యం సంతరించుకుంది. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం లేకపోవడం.. యాదాద్రిలో ప్రత్యేక పూజలు చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. 

యాదాద్రి : యాదాద్రి దేవస్థానాన్ని సోమవారం తెలంగాణ రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళసై సౌందర్ రాజన్ సందర్శించారు. బాలాలయంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు, అధికారులు సంయుక్తంగా ఆమెకు పూర్ణకుంభంతో స్వాగతం పలికి ఆశీర్వచనం చేశారు. ఆలయ ఈవో ఎన్ గీత, అనువంశిక ధర్మకర్త బి నరసింహమూర్తి లడ్డూ ప్రసాదం అందజేశారు. ఈ సందర్భంగా బ్రహ్మోత్సవాల్లో భాగంగా కొనసాగుతున్న అలంకార సేవలో గవర్నర్ పాల్గొన్నారు. అంతకు ముందు పూర్తయిన ప్రధానాలయ నిర్మాణాలను గవర్నర్ పరిశీలించారు.

ఇదిలా ఉండగా సోమవారం ఉదయం తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ యాదాద్రి క్షేత్రానికి చేరుకున్నారు. జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, ఆలయ ఈవో గీత తదితరులు గవర్నర్ కు ఘనస్వాగతం పలికారు. అనంతరం ఆమె పోలీసుల గౌరవ వందనం స్వీకరించి, యాదాద్రి ప్రధానాలయాన్ని సందర్శించారు. స్వయంభూ మూర్తులను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాగా తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం లేకపోవడంతో ప్రతిపక్షాలు విరుచుకుపడుతున్నాయి.