నిబంధనలు పాటిస్తేనే కరోనా సంక్షోభం నుంచి బయటపడవచ్చన్నారు తెలంగాణ గవర్ననర్ తమిళిసై సౌందరరాజన్. ప్రపంచ రెడ్‌క్రాస్‌ దినోత్సవం సందర్భంగా ఆ సొసైటీ ప్రతినిధులతో శనివారం ఆమె సమావేశమయ్యారు.

రాష్ట్ర, జిల్లా స్థాయి ప్రతినిధులతో పుదుచ్చేరి నుంచి గవర్నర్ వర్చువల్‌గా మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రస్తుత పరిస్థితులను తట్టుకునేందుకు కొవిడ్‌ నిబంధనలు పాటించేలా అవగాహన కల్పించడం కీలకమని తమిళిసై సూచించారు.

Also Read:అధికారులను సైతం వదలని మహమ్మారి: మునుగోడు తహసీల్దార్‌ కరోనాకు బలి

ప్రజల్ని చైతన్య పరిచే దిశగా రెడ్‌క్రాస్‌ సొసైటీ కృషి చేయాలని ఆమె విజ్ఞప్తి చేశారు.  కరోనా సంక్షోభం సమయంలో రెడ్‌క్రాస్‌ వాలంటీర్ల సేవ అపూర్వమని తమిళిసై ప్రశంసించారు. మరిన్ని సేవా కార్యక్రమాలతో బాధితులకు అండగా నిలవాలని తమిళిసై విజ్ఞప్తి చేశారు. ప్రజల భాగస్వామ్యంతోనే వైరస్‌ ప్రబలకుండా చూడగలమని ఆమె ఆకాంక్షించారు. 

కాగా, తెలంగాణలో శనివారం 5,186 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయి. ఒకే రోజు 38 మంది కోవిడ్‌తో ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 4,92,385కి చేరగా... మరణాల సంఖ్య 2704కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 7,994 మంది కోలుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 4,21,219కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 68462 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.