దేశంలో కోవిడ్ మహమ్మారి విలయతాండవం చేస్తోంది. ఇప్పటికే దీని బారినపడి సినీతారలు, రాజకీయ నాయకులు, క్రీడాకారులు, ఉన్నతాధికారులు మరణించారు. తాజాగా తెలంగాణలోని మునుగోడు తహశీల్దార్ సునంద కరోనా కాటుకు బలయ్యారు.

కోవిడ్ బారినపడిన ఆమె గత కొన్ని రోజులుగా హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో శనివారం ఆరోగ్యం విషమించడంతో సునంద కన్నుమూశారు. ఆమె గతంలో మాడుగులపల్లి, నల్గొండ ఆర్డీవో కార్యాలయాల్లో పనిచేసి రెండు నెలల క్రితం మునుగోడుకు బదిలీపై వచ్చారు.

Also Read:కరోనాకి కొడుకు బలి... అది చూసి తట్టుకోలేక..!

సునంద మరణం పట్ల రాష్ట్ర తహశీల్దార్ అసోసియేషన్‌తో పాటు వివిధ పార్టీల నేతలు సంతాపం వ్యక్తం చేశారు. కల్వకుంట్ల సర్పంచ్‌ పి. బిక్షం, జమస్థాన్‌పల్లి సర్పంచ్‌ పి. స్వామి కూడా సునంద మరణం పట్ల సంతాపం తెలిపారు. 

కాగా, తెలంగాణలో శనివారం 5,186 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయి. ఒకే రోజు 38 మంది కోవిడ్‌తో ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 4,92,385కి చేరగా... మరణాల సంఖ్య 2704కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 7,994 మంది కోలుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 4,21,219కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 68462 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.