హైదరాబాద్: కరోనాను నివారించే కోవాగ్జిన్ వ్యాక్సిన్ త్వరలోనే అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ అభిప్రాయపడ్డారు.

మంగళవారం నాడు ఆమె శామీర్ పేటలోని భారత్ బయోటెక్ ను సందర్శించారు.  కరోనా వ్యాక్సిన్ ను తయారీ పరిశోధనలో ఉన్న శాస్త్రవేత్తలతో ఆమె మాట్లాడారు. 

వ్యాక్సిన్ తయారీకి సంబంధించిన అంశాలపై ఆమె చర్చించారు. కరోనా వ్యాక్సిన్ తయారీ కోసం భారత్ బయోటెక్ తీవ్రంగా కృషి చేస్తోంది. హైద్రాబాద్ నుండే కరోనాకు వ్యాక్సిన్ వచ్చే  అవకాశం ఉందని గతంలో సీఎం కేసీఆర్ ఆశాభావం వెలిబుచ్చిన విషయం తెలిసిందే.

ఈ ఏడాదిలోనే కరోనాకు వ్యాక్సిన్ వచ్చే అవకాశం ఉందని గవర్నర్ అభిప్రాయపడ్డారు. వ్యాక్సిన్ తయారీ కోసం కష్టపడుతున్న ప్రతి ఒక్కరికి ఆమె ధన్యవాదాలు తెలిపారు.వచ్చే ఏడాది త్రైమాసికంలోనే కరోనాకు వ్యాక్సిన్ వచ్చే అవకాశం ఉందని రెండు రోజుల క్రితం కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ ప్రకటించిన విషయం తెలిసిందే.