తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ మంగళవారం రాత్రి ఢిల్లీకి చేరుకున్నారు. నేడు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో గవర్నర్ తమిళిసై భేటీ కానున్నారు. సీఎం కేసీఆర్ ఢిల్లీలో ఉన్న సమయంలోనే.. గవర్నర్ తమిళిసై ఢిల్లీకి వెళ్లడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. 

తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ మంగళవారం రాత్రి ఢిల్లీకి చేరుకున్నారు. నేడు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో గవర్నర్ తమిళిసై భేటీ కానున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో రాజ్‌భవన్, ప్రగతిభవన్ మధ్య దూరం పెరిగిన నేపథ్యంలో.. గవర్నర్ తమిళిసై ఢిల్లీ పర్యటన చర్చనీయాంశంగా మారింది. కేంద్ర హోం శాఖ పిలుపు మేరకే తమిళిసై ఢిల్లీకి వెళ్లినట్టుగా సమాచారం. అయితే ముందుగా సోమవారం రాత్రి ఢిల్లీకి బయలుదేరి వెళ్లాల్సి ఉండగా.. అది వాయిదా పడింది. ఇక, మంగళవారం రాత్రి గవర్నర్ తమిళిసై ఢిల్లీకి చేరుకున్నారు. 

నేడు కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో జరిగే సమావేశంలో రాష్ట్రంలోని పరిస్థితులను గవర్నర్ తమిళిసై ఆయనకు వివరించనున్నారు. గవర్నర్ ప్రోటకాల్ ఉల్లంఘన, ఇతర అంశాలపై చర్చించే అవకాశం ఉంది. రాష్ట్ర ప్రభుత్వంపై కేంద్ర మంత్రికి ఫిర్యాదు చేయనున్నట్లుగా కూడా వార్తలు వస్తున్నాయి. ఇక, ప్రస్తుతం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఢిల్లీలో ఉన్న సంగతి తెలిసిందే. సీఎం కేసీఆర్ ఢిల్లీలో ఉన్న సమయంలోనే.. గవర్నర్ తమిళిసై ఢిల్లీకి వెళ్లడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. 

ఇక, గత కొంతకాలంగా తెలంగాణలో గవర్నర్, రాష్ట్ర ప్రభుత్వం మధ్య దూరం పెరిగింది. ఈ విబేధాలు ఇటీవల తారాస్థాయికి చేరకున్నాయి. నామినేటెడ్ ఎమ్మెల్సీ కోటాలో కౌశిక్ రెడ్డిని పేరును కేబినెట్ సిఫారసు చేయగా.. గవర్నర్ దానికి ఆమోదం తెలుపలేదు. అప్పటి నుంచి గవర్నర్‌‌కు, ప్రభుత్వానికి మధ్య దూరం పెరుగుతూ వస్తుంది. రాజ్ భవన్‌లో గణతంత్ర వేడుకలకు సీఎం కేసీఆర్ హాజరుకాలేదు. 

సమక్క సారక్క జాతరలో పాల్గొనడానికి వెళ్లిన గవర్నర్‌‌కు ఆ జిల్లా కలెక్టర్, ఎస్పీలు ఆహ్వానించడానికి రాలేదు. దీంతో ప్రోటోకాల్ పాటించలేదనే విమర్శలు వినిపించాయి. ఇందుకు సంబంధించి ఫిర్యాదులు అందడంతో ఇప్పటికే కేంద్ర హోం శాఖ రాష్ట్ర ప్రభుత్వం నుంచి నివేదిక కోరింది. గవర్నర్ తమిళిసై హన్మకొండ, యాదాద్రి పర్యటనల సందర్భంగా మంత్రులు, అధికారులు ప్రోటోకాల్ పారించలేదన్న విమర్శలు ఉన్నాయి. ఈ పరిణామాలపై తమిళిసై వివిధ సందర్భాల్లో బహిరంగ వ్యాఖ్యలు కూడా చేశారు.

తాజాగా రాజ్‌భవన్‌లో నిర్వహించిన ఉగాది వేడుకలకు సీఎం కేసీఆర్, మంత్రులు, ఉన్నతాధికారులను హాజరుకాలేదు. ఈ క్రమంలోనే గవర్నర్ తమిళిసై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గవర్నర్ హోదాలో తన పరిమితులు ఏంటో తనకు తెలుసునన్నారు. తనను ఎవరూ నియంత్రించలేరని తమిళిసై వ్యాఖ్యానించారు. తనకు ఎలాంటి ఇగో లేదని.. ప్రజల సమస్యల కోసం గ్రీవెన్ సెల్ ఏర్పాటు చేశామని ఆమె పేర్కొన్నారు. అందరితో సఖ్యతగా వుండటమే తనకు తెలుసునని తమిళిసై పేర్కొన్నారు. రాజ్‌భవన్ తెలంగాణ ప్రజల మేలు కోసమే వుందన్నారు. వచ్చే నెల నుంచి రాజ్‌భవన్‌లో ప్రజాదర్బార్ నిర్వహిస్తామని తమిళిసై వెల్లడించారు. 

తన ఇన్విటేషన్‌ని గౌరవించనందుకు బాధపడటం లేదన్నారు గవర్నర్. 119 మంది ఎమ్మెల్యేలకు ఆహ్వానం పంపించానని.. కొందరు వచ్చారు, రానీ వారిపై చెప్పేదేమీ లేదని తమిళిసై వ్యాఖ్యానించారు. తనను ప్రగతి భవన్‌లో ఉగాది వేడుకలకు ఆహ్వానించి వుంటే.. ప్రోటోకాల్ పక్కనపెట్టి అడెండ్ అయ్యేదాన్నని ఆమె అన్నారు. 

ఈ పరిణామాల నేపథ్యంలో ప్రభుత్వ తీరుపై గవర్నర్‌ అసంతృప్తితో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆమె ఢిల్లీకి వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. అమిత్‌ షాతో భేటీలో ఆమె ఈ అంశాలను ప్రస్తావించే అవకాశం ఉంది.