తెలంగాణ రాజ్‌భవన్‌లో జరిగిన ఉగాది వేడుకలు మరోసారి రాజకీయంగా చర్చనీయాంశమయ్యాయి. ఈ వేడుకలకు సీఎం కేసీఆర్ దూరంగా వుండటంతో సర్వత్రా చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.  

తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజ్‌భవన్‌లో జరిగిన ఉగాది వేడుకల్లో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ.. గవర్నర్ హోదాలో తన పరిమితులు ఏంటో తనకు తెలుసునన్నారు. తనను ఎవరూ నియంత్రించలేరని తమిళిసై వ్యాఖ్యానించారు. తనకు ఎలాంటి ఇగో లేదని.. ప్రజల సమస్యల కోసం గ్రీవెన్ సెల్ ఏర్పాటు చేశామని ఆమె పేర్కొన్నారు. అందరితో సఖ్యతగా వుండటమే తనకు తెలుసునని తమిళిసై పేర్కొన్నారు. రాజ్‌భవన్ తెలంగాణ ప్రజల మేలు కోసమే వుందన్నారు. వచ్చే నెల నుంచి రాజ్‌భవన్‌లో ప్రజాదర్బార్ నిర్వహిస్తామని తమిళిసై వెల్లడించారు. 

తన ఇన్విటేషన్‌ని గౌరవించనందుకు బాధపడటం లేదన్నారు గవర్నర్. 119 మంది ఎమ్మెల్యేలకు ఆహ్వానం పంపించానని.. కొందరు వచ్చారు, రానీ వారిపై చెప్పేదేమీ లేదని తమిళిసై వ్యాఖ్యానించారు. తనను ప్రగతి భవన్‌లో ఉగాది వేడుకలకు ఆహ్వానించి వుంటే.. ప్రోటోకాల్ పక్కనపెట్టి అడెండ్ అయ్యేదాన్నని ఆమె అన్నారు. యాదాద్రికి వెళ్లాలని వుండేదని.. కానీ తనను ఆహ్వానించలేదని తమిళిసై ఆవేదన వ్యక్తం చేశారు. తాను వివాదాస్పదం చేసే వ్యక్తిని కాదని.. గ్యాప్ సృష్టించే వ్యక్తిని కాదన్నారు. కొన్ని అంశాలపై డిఫరెన్సెస్ వున్నాయని.. తాను ఎన్నిసార్లు ఆహ్వానాలను పంపినా పట్టించుకోవడం లేదని తమిళిసై వ్యాఖ్యానించారు. 

కాగా.. తెలంగాణలో రాజ్‌భవన్ (raj bhavan) - ప్రగతి భవన్ (pragathi bhavan) మధ్య వున్న విభేదాలు మరోసారి చర్చనీయాంశమయ్యాయి. రాజ్‌భవన్‌లో జరిగిన ఉగాది వేడుకలకు సీఎం కేసీఆర్ (kcr) దూరంగా వున్నారు. అంతేకాదు.. టీఆర్ఎస్ నేతలు కూడా ఎక్కడా కనిపించకపోవడం రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది. వేడుకల్లో పాల్గొనాలని సీఎం కేసీఆర్, కేబినెట్ మంత్రులకు ఆహ్వానం పంపారు. కానీ.. వారెవ్వరూ హాజరు కాలేదు. ఎమ్మెల్యే జయ్ పాల్ యాదవ్ మాత్రమే పాల్గొన్నారు. బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. 

ఇకపోతే.. మొన్న హన్మకొండ జిల్లాకు విచ్చేసిన తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ (tamilisai soundararajan) పర్యటనలో ప్రోటోకాల్ వివాదం చోటు చేసుకుంది. ఆమెకు స్వాగతం పలికేందుకు ప్రజా ప్రతినిధులెవ్వరూ రాలేదు. ప్రోటోకాల్ ప్రకారం స్వాగతం పలికేందుకు గ్రేటర్ వరంగల్ మేయర్ హాజరుకాలేదు. జాతీయ సాంస్కృతిక మహోత్సవం ప్రారంభోత్సవానికి గవర్నర్ హాజరయ్యారు. అయితే మంత్రులు, ఎమ్మెల్యేలు పత్తా లేరు. దీంతో గవర్నర్ తమిళిసైకి జిల్లా కలెక్టర్, సీపీలు స్వాగతం పలికారు. 

కొద్దిరోజుల క్రితం కూడా గవర్నర్ (medaram jatara) పర్యటనలోనూ ప్రోటోకాల్ వివాదం రాజుకుంది. గవర్నర్‌ను మంత్రులు రీసివ్ చేసుకోలేదు. గవర్నర్ వచ్చేసరికి అక్కడి నుంచి మంత్రులు వెళ్లిపోయారు. అయితే మంత్రులు, ఎమ్మెల్యేలు ఇతర ప్రజాప్రతినిధులు లేకుండానే గిరిజనుల ఆరాధ్య దైవం .. సమ్మక్క- సారలమ్మలను (sammakka saralamma jatara) ఆమె దర్శించుకున్నారు. 

తెలంగాణ‌లో గ‌త కొన్ని రోజులుగా రాజ‌కీయాలు కీల‌క మలుపులు తిరుగుతున్నాయి. ఈ క్ర‌మంలో గులాబీ బాస్ వేస్తున్న అడుగులు చ‌ర్చ‌నీయాంశంగా మారుతున్నాయి. మ‌రీ ముఖ్యంగా తెలంగాణ సీఎం-గ‌వ‌ర్న‌ర్ మ‌ధ్య దూరం పెరుగుతోందా? అనే చ‌ర్చ మొద‌లైంది. దీనికి స్ప‌ష్టమైన స‌మాధానం రాక‌పోయినా.. అవుననే రాజ‌కీయా వ‌ర్గాల్లో చ‌ర్చ న‌డుస్తోంది. దీనికి ఇటీవల జ‌రిగిన గ‌ణ‌తంత్ర దినోత్సవ వేడుక‌లు మ‌రింత బ‌లం చేకూరుస్తున్నాయి. గ‌వ‌ర్న‌ర్‌-ముఖ్యమంత్రికి దూరం పెరుగుతున్న‌ద‌నే విష‌యాన్ని స్ప‌ష్టం చేసే విధంగా రిప‌బ్లిక్ డే లో ఏం జ‌రిగింద‌నే దానితో పాటు అనేక అంశాలు ఇప్పుడు రాష్ట్ర రాజ‌కీయాల్లో తీవ్ర చ‌ర్చ‌కు దారి తీస్తున్నాయి. 

గ‌త కొంత కాలంగా రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న రాజ‌కీయ ప‌రిణామాల నేప‌థ్యంలో తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ (kcr) జాగ్ర‌త్త‌గా ముందుకు సాగుతున్నార‌ని తెలుస్తోంది. అయితే, రాజ్ భ‌వ‌న్‌, సీఎం కార్యాల‌యం మ‌ధ్య దూరం పెరుగుతున్న‌ద‌ని రాజ‌కీయాల్లో చ‌ర్చ జ‌ర‌గ‌డానికి రిప‌బ్లిక్ డే వేడుక‌లు కేంద్ర బిందువుగా మారాయి. రాజ్‌భ‌వ‌న్ లో జ‌రిగిన రిప‌బ్లిక్ డే వేడుక‌ల‌కు ముఖ్య‌మంత్రి కేసీఆర్ హాజ‌రు కాలేదు. అలాగే, రాష్ట్ర మంత్రులు కూడా ఎవ‌రూ హాజ‌రు కాలేదు. అలాగే ఇటీవల జరిగిన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కూడా సాంప్రదాయానికి విరుద్ధంగా గవర్నర్ ప్రసంగం లేకుండానే జరిగియి.