అసెంబ్లీ సెషన్స్ ప్రొరోగ్ కాలేదని గవర్నర్ ప్రసంగం తీసేయడం ద్వారా తెలంగాణ ప్రభుత్వం కొత్త సంప్రాదాయానికి తెరతీసిందని గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ అన్నారు. గవర్నర్ ప్రసంగం అంటే తన సొంత ప్రసంగం కాదని చెప్పారు. 

తెలంగాణ ప్రభుత్వంపై గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం చెన్నైలో ఉన్న తమిళిసై సౌందర్‌రాజన్ మాట్లాడుతూ.. గవర్నర్ ప్రసంగం అంటే తన సొంత ప్రసంగం కాదని అన్నారు. ప్రభుత్వం ఇచ్చే స్టేట్ మెంట్‌నే తాను చదివి వినిపిస్తానన్నారు. తన ప్రసంగం లేదని చెప్పినా సెషన్‌ను అనుమతించానని ఆమె తెలిపారు. ప్రజా సంక్షేమం ఆగొద్దనే బడ్జెట్ సెషన్‌ను అనుమతి ఇచ్చానని తమిళిసై పేర్కొన్నారు. సెషన్స్ ప్రొరోగ్ కాలేదని గవర్నర్ ప్రసంగం తీసేసారని చెప్పారు. ఇలా చేయడం ద్వారా తెలంగాణ ప్రభుత్వం కొత్త సంప్రాదాయానికి తెరతీసిందన్నారు.

ఇక, గవర్నర్ ప్రసంగం లేకుండా తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ (Tamilisai Soundararajan) ఇదివరకే స్పందించిన సంగతి తెలిసిందే. ఇది కొత్త సెషన్ కాదని.. అంతకుముందు జరిగిన సెషన్‌కు కొనసాగింపని ప్రభుత్వం చెబుతోందని ఆమె అన్నారు. గవర్నర్ ప్రసంగంతో సభ ప్రారంభించడం సాధ్యం కాదని ప్రభుత్వం పేర్కొందని తమిళిసై వ్యాఖ్యానించారు. సాంకేతిక కారణాలతో గవర్నర్ ప్రసంగాన్ని రద్దు చేశారని తమిళిసై తెలిపారు. 5 నెలల తర్వాత సభ సమావేశమవుతోందని.. గవర్నర్ ప్రసంగంతో సభ ప్రారంభం సాధ్యం కాదని ప్రభుత్వం వెల్లడించిందని ఆమె చెప్పారు. 

ప్రభుత్వం నిర్ణయం రాజ్యాంగ హక్కులకు భంగమని.. తనకు ప్రజా సంక్షేమమే ముఖ్యమంత్రి తమిళిసై స్పష్టం చేశారు. గవర్నర్‌కు కొన్ని అధికారులున్నా.. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా అనుమతిచ్చానని ఆమె అన్నారు. గవర్నర్ ప్రసంగం లేకపోవడం వల్ల.. గతేడాది ప్రభుత్వ తీరుపై చర్చించే అవకాశాన్ని కోల్పోతున్నారని తమిళిసై తెలిపారు. గవర్నర్ ప్రసంగంతో సమావేశాలు ప్రారంభమవుతాయని తొలుత చెప్పారని.. ఇప్పుడు అనుకోకుండా తప్పు రాశామని చెబుతున్నారని ఆమె అన్నారు.

Scroll to load tweet…

సీఎం కేసీఆర్ త్వరగా కోలుకోవాలి..
తెలంగాణ సీఎం కేసీఆర్ త్వరగా కోలుకోవాలని గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ స్పందించారు. కేసీఆర్ స్వల్ప అస్వస్థతతో ఆస్పత్రికి వెళ్లారని వార్త విని ఆందోళన చెందినట్టుగా తెలిపారు. కేసీఆర్ ఆరోగ్యంగా ఉండాలని, త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్టుగా చెప్పారు. ఈ మేరకు గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ ట్వీట్ చేశారు.