కఠిన చర్యలు తీసుకోవాలి: కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడి ఘటనపై గవర్నర్ తమిళిసై
దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్ధి కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడి ఘటనపై గవర్నర్ తమిళిసై విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని గవర్నర్ డీజీపీని ఆదేశించారు.
హైదరాబాద్: మెదక్ ఎంపీ, దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్ధి కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడి చేసిన ఘటనపై దర్యాప్తు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ డీజీపీ అంజనీకుమార్ ను ఆదేశించారు.
ఈ ఘటనపై గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ విచారం వ్యక్తం చేశారు.స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరగాల్సిన అవసరం ఉందని గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ అభిప్రాయపడ్డారు.ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్ధులందరికి సరైన భద్రత కల్పించాలని గవర్నర్ డీజీపీని ఆదేశించారు. ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదని ఆమె చెప్పారు.
ఇవాళ దౌల్తాబాద్ మండలం సూరంపల్లి గ్రామంలో కొత్త ప్రభాకర్ రెడ్డి ప్రచారం చేసేందుకు వెళ్లిన సమయంలో రాజు అనే వ్యక్తి ప్రభాకర్ రెడ్డిపై దాడి చేశాడు. ఈ విషయాన్ని గుర్తించిన ఎంపీ గన్ మెన్ రాజును అడ్డుకున్నాడు. రాజు చేతిలోని ఆయుధాన్ని లాక్కున్నాడు. అక్కడే ఉన్న బీఆర్ఎస్ శ్రేణులు రాజును పట్టుకుని చితకబాదారు. ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి తన వాహనంలో వెంటనే ఆసుపత్రికి వెళ్లారు.
also read:దుబ్బాక ఎంపీ కొత్తా ప్రభాకర్ రెడ్డిపై హత్యాయత్నం, కత్తితో దాడి...
గజ్వేల్ ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స తర్వాత ఆయనను సికింద్రాబాద్ యశోద ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడి చేసిన రాజుది మిరుదొడ్డి మండలం చెప్యాల గ్రామంగా గుర్తించారు. ప్రభాకర్ రెడ్డిపై రాజు ఎందుకు దాడి చేశారనే విషయమై పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు.